కాంగ్రెస్ సర్కార్‌ రుణమాఫీ చారాణ చేసి.. బారాణ ఎగ్గొట్టింది – మాజీ మంత్రి హరీశ్‌ రావు

Former Minister Harish Rao Criticizes Congress Govt Over Incomplete Loan Waiver of Farmers

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండల కేంద్రంలో శనివారం జరిగిన బీరప్ప ఆలయ వార్షికోత్సవంలో మాజీ మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యంగా రుణమాఫీ విషయంలో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

రుణమాఫీపై ఎద్దేవా

కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో “చారాణ చేసి.. బారాణ ఎగ్గొట్టింది” అంటూ హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూర్చకుండా కాలయాపన చేస్తోందని, క్షేత్రస్థాయిలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను ఈ ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు.

ప్రాజెక్టుల వల్ల మారిన ముఖచిత్రం

మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల వల్ల గజ్వేల్ ప్రాంతం రూపురేఖలు మారాయని హరీశ్‌ రావు గుర్తు చేశారు. గతంలో నీరు, గ్రాసం కోసం వలస వెళ్లే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అవే ప్రాజెక్టుల పుణ్యమా అని ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. కనీసం మూగజీవాలకు నట్టల మందు ఇచ్చే శక్తి కూడా ఈ ప్రభుత్వానికి లేదని రేవంత్ రెడ్డి సర్కార్‌పై మండిపడ్డారు.

రియల్ ఎస్టేట్ పతనం

బీఆర్ఎస్ హయాంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని హరీశ్‌ వ్యాఖ్యానించారు. ఇప్పుడు భూములను కొనేవారు లేరని, కనీసం చూసేవారు కూడా కరువయ్యారని పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు

ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు నిజాలను గమనిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here