తిరుమల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా..తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా భక్తుల దర్శనం విషయంలో కఠిన ఆంక్షలను అమలు చేయనుంది. పర్వదినాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ ఫోకస్ పెట్టింది.
ఒకవైపు తిరుచానూరులో గల పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి.. వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఏర్పాట్లను ఘనంగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
టికెట్లు కోటాతో పాటు ఇతర అంశాలపైన కూడా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షించారు. వైకుంఠ ఏకాదశికి కావలసిన పూల అలంకరణలతో పాటు.. భక్తుల వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపైన ఆయన కూడా చర్చించారు. జనవరి 10వ తేదీన స్వర్ణ రథం, 11వ తేదీన చక్రస్నానం నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు.
పది రోజుల పాటు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉండడంతో.. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షించారు. టీటీడీలోని వివిధ విభాగాల అధికారులకు..ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు.దీని ప్రకారం జనవరి 10 నుంచి 19 వరకు పది రోజులపాటు.. వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ కల్పించబోతోంది.
వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 40 రోజుల సమయం ఉండటంతో.. టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాటు చేస్తున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వడానికి తమ తొలి ప్రాధాన్యత ఇస్తూ.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలంటూ అడిషనల్ ఈవో ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు ఆ పది రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను కూడా రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే దర్శనాలు కల్పించనున్నారు. అంతేకాకుండా ఏకాదశి పర్వదినాల నాడు చంటి బిడ్డలు, వృద్ధులు,దివ్యాంగులు,ఆర్మీ, ఎన్నారై దర్శనాలను రద్దు చేయడానికి టీటీడీ నిర్ణయం తీసుకుంది.