ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన త్వరలోనే వారికి నష్ట పరిహారం బదిలీ చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. సోమవారం మూడోరోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ క్రమంలో పోలవరం నిర్వాసితులకు పరిహారం, వరదల్లో ఆహార సరఫరాదారులకు బిల్లుల చెల్లింపు, ప్రభుత్వ ఖాతాల్లో నిధుల వినియోగంపై టీడీపీ సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు. ఈ పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టం చేయాలని టీడీపీ కోరుతుండగా, మరోవైపు వైసీపీ మంత్రులు ధీటుగా బదులిస్తున్నారు. సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలపై సమాధానమిస్తూ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పోలవరం బాధితులకి పునరావాసం పూర్తి కాగానే, పరిహారం బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రూ.20 వేల కోట్లు అవసరమని నిపుణులు చెప్తున్నారని, ఆ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి దాదాపు రూ. 3 వేల కోట్లు రావాల్సి ఉందని, ఈ నిధులు బ్లాక్ అయ్యాయని, దీనికి కారణం చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపించారు. అలాగే ప్రాజెక్టుకి సంబంధించి 30 జూన్, 2021న స్పష్టమైన జీవో కూడా ఇచ్చామని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గత టీడీపీ ప్రభుత్వం రూ. 6.86 లక్షలు ప్రకటిస్తే, దానిని వైసీపీ ప్రభుత్వం రూ. 10 లక్షలకు పెంచిందని తెలిపారు. ఈ మొత్తం సుమారు రూ. 500 కోట్లు ఉంటుందని, ఇతర సంక్షేమ పథకాలకు ఎలాగైతే నిధులు అందిస్తున్నామో.. అలాగే ఈ మొత్తాన్ని కూడా ముంపు బాధితులకి అందజేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కాగా సభలో ప్రభుత్వం సోమవారం సభలో మొత్తం ఐదు బిల్లులు ప్రవేశపెట్టింది. ఇక సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగనుంది. అయితే వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఒక్కరే పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో, డిప్యూటీ స్పీకర్‌గా ఆయన ఎంపిక లాంఛనమే కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY