ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న అందరికీ ఇళ్లు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. 2022 నాటికి అర్హులైన లబ్ధిదారులందరికీ పక్క ఇళ్లు ఏర్పాటు చేసేలా కేంద్రం రూపొందించిన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గొప్ప సంక్షేమ పథకమని పేర్కొన్నారు.
కేంద్రప్రభుత్వ చర్యలకు కొనసాగింపుగా అందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం 68,381 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17,005 గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, అందుకోసం రూ.23,535 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పీఎంఏవై అర్బన్ మరియు గ్రామీణ కార్యక్రమం కింద రూ.50,944 కోట్లు అంచనాతో ఈ 17,005 గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో 28.30 లక్షల పక్కాఇళ్లను నిర్మించేందుకు సిద్ధమయ్యామని చెప్పారు.
కాగా ఈ గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.34,104 కోట్లు ఖర్చవుతాయని, ప్రభుత్వం ఇప్పటికే ఇళ్లపట్టాలు కోసం రూ.23,535 కోట్లు ఖర్చు చేసినందన్నారు. ఈ నేపథ్యంలో కాలనీల్లో మౌలిక సదుపాయాలు కోసం అంత పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడం కష్టతరమని తెలిపారు. మౌలిక సదుపాయాలు లేకుంటే ఇళ్ల నిర్మాణం పూర్తైన కూడా లబ్ధిదారులు ఇళ్లలోకి చేరడం లేదని, దీనిద్వారా పీఎంఏవై లక్ష్యం పూర్తిగా నెరవేరడం లేదని చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని పీఎంఏవై కింద గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శాఖ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు నిధులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ