ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించారు సీఎం చంద్రబాబు. అయితే అమరావతి రాజధానిని నిర్మించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో అటు రాజధాని ఇటు రాష్ట్ర ప్రగతిపై దృష్టి పెట్టారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ హడావుడి చేసి ఉన్న రాజధాని అమరావతిని పట్టించుకోలేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మరో కొత్త రాజధానిని నిర్మించారు లేకపోగా ఉన్న రాజధానిలో ఒక్క ఇటుక కూడ పేర్చలేదు. దీంతో గత ఐదేళ్లలో అమరావతి నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతి రాజధాని పనులు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగిస్తానని హామీ ఇచ్చిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. రాజధాని అమరావతి పనులను పరుగులు పెట్టించడమే కాదు. హైదరాబాద్ తరహాలో అభివృద్ది చేయడానికి సన్నహకాలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు.
ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి పలు అభివృద్ది ప్రాజెక్టులను ఖాయం చేసుకువచ్చారు. కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిపిన భేటీలో రాజధాని అమరావతి అనుసంధానించే పలు రహదారులకు ప్రాథమిక ఆమోదం లభించింది. అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం రూ.20,000ల నుంచి రూ.25,000ల కోట్లకుపైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రస్తుతం 270.7 కి.మీ. పొడవైన జాతీయ రహదారి ఉంది. ఈ జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా 70 కి.మీ. దూరం తగ్గేలా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. మేదరమెట్ల-అమరావతి మధ్య 90 కి.మీ. పొడవైన గ్రీన్‌ఫీల్డ్ హైవేని కూడా నిర్మించనున్నారు.
189 కిలోమీటర్ల పొడవైన అవుటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రతిపాదనకు కేంద్ర సర్కారు ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే అమరావతికి ఏపీలోని ఇతర ప్రాంతాలు, ఇరుగు పొరుగు రాష్ట్రాల సరిహద్దులతో కనెక్టివిటీ మెరుగు అవుతుంది. అమరావతి చుట్టూ నిర్మించబోయే ఔటర్ రింగు రోడ్డు కేంద్రంగా అభివృద్ధి కేంద్రీకృతమవనుంది. కొత్తగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార,వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు ఇలా అన్ని ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా ఏర్పాటవుతాయి. అమరావతికి మణిహారంలా మారినుంది ఓఆర్‌ఆర్. చుట్టూ కావాల్సినన్ని భూములు అందుబాటులో ఉండడంతో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలు ఎంతో ఆసక్తి చూపే అవకాశముంది. రానున్న కాలంలో అమరావతిలో అభివృద్ది పనులు ఏ అటంకాలు లేకుండా సక్రమంగా జరిగితే భవిష్యత్తులో మరెవరు కూడా అమరావతి రాజధాని కాదనలేరు. రాజధానిని మార్చాలన్న సాహసం మరెవరు కూడా చేయలోకపోతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఏపీకి అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY