ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా కీలక హోదాల్లో ఉండే అధికారుల విషయంలో మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చంద్రబాబు నాయుడు మార్చేశారు. పాలనలో తనకు అనుకూలంగా ఉండేలా కొత్త టీమ్‌ను రెడీ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో పాలనలో కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారిని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించారు.
ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డాను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించారు. ఈ మేరకు మేరకు ఆయన్ను రిలీవ్ చేసి డిప్యుటేషన్ పైన తమ రాష్ట్రానికి పంపించాలని కేంద్రానికి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అటు కేంద్రం కూడా చంద్రబాబు రాసిన లేఖపై వెంటనే స్పందించింది. మహేష్ చంద్ర లడ్డాను రాష్ట్ర సర్వీస్‌లోకి పంపిస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఆయన ఏపీకి రానున్నారు. రాష్ట్రానికి వచ్చిన వెంటనే ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
1998 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మహేష్ చంద్ర లడ్డా.. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఐజీగా పని చేస్తున్నారు. ఆయన స్వస్థలం రాజస్థాన్. 1998లో విశాఖలో ఏఎస్పీగా మహేష్ చంద్ర లడ్డా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాల ఎస్పీగా లడ్డా పని చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన సమయంలో మావోయిస్టుల ఏరివేత విషయంలో లడ్డా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో 2005లో మావోయిస్టులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. తృటిలో ఆ దాడి నుంచి లడ్డా తప్పించుకొని.. ప్రాణాలతో బయట పడ్డారు.
విజయవాడ డిప్యూటీ కమిషనర్‌గా.. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్‌గా కూడా మహేంద్ర చంద్ర లడ్డా పని చేశారు. వైజాగ్ ఎయిర్‌పోర్టులో జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగినప్పుడు విశాఖ కమిషనర్‌గా లడ్డా ఉన్నారు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకు ఆయన సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. అయితే ముందు నుంచి కూడా మహేంద్ర చంద్ర లడ్డా అంటే చంద్రబాబుకు ఎంతో నమ్మకం. ఆయన నీతి, నిజాయితీని చూసి చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి తీసుకొస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE