మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహారించుకుంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానులపై ఇంతకు ముందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా గానీ, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అందరికీ విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు, ఇంతకముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని అన్నారు. ఇక అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి స్థాయిలో సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ రోజుకు దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చేవన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో రాష్ట్రంలో వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టటం జరిగిందన్నారు. అయితే వికేంద్రీకరణకు సంబంధించి అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలతో ఇలా ఈ రెండేళ్ల కాలంలో అనేక విధాలుగా ప్రచారాలు చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే విస్తృతంగా వివరించేందుకు గతంలో ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని, మళ్లీ సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు తీసుకువస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు
అలాగే రాజధాని అంశంపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, “1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్టానికి రాజధానిగా కర్నూలు ఉండేదని, గుంటూరులో హైకోర్టు ఉండేదన్నారు. అనంతరం 1956లో కర్నూలు నుంచి రాజధానిని, గుంటూరు నుంచి హైకోర్టును హైదరాబాద్ కు ఎలా తీసుకుపోయారో అందరికి తెలుసన్నారు. అలా జరిగింది కాబట్టి, శ్రీబాగ్ ఒడంబడిక, ఒప్పందాలకు అనుగుణంగా రాయలసీమకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇక ప్రస్తుతం ఉన్న అమరావతి ప్రాంతమంటే నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతమంటే నాకు ప్రేమ. కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున 50వేల ఎకరాలకు లక్ష కోట్లు అని చెప్పారు. లక్ష కోట్లు ఖర్చు తాజా లెక్కల ప్రకారం అవుతుండగా, పదేళ్ల తర్వాత లక్షల కోట్ల విలువ ఆరేడు లక్షల కోట్లు అవుతుంది. కనీసం రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, ఇతర సదుపాయాలకు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే రాజధాని ఊహా చిత్రం ఎలా సాధ్యమవుతుంది. ప్రజలను ఈ విధంగా తప్పుదోవ పట్టించడం సమంజసమేనా? ఇలాగే ఉంటే మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి?, పిల్లలందరూ ఇంకా పెద్ద నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళ్లాల్సిందేనా?, ప్రస్తుతం ఏపీలో అతి పెద్ద నగరం విశాఖపట్నం. అక్కడ ఇప్పటికే అన్నీ వసతులు ఉన్నాయి. వాటికి కొత్తగా మరిన్ని అదనపు హంగులు దిద్దితే, ఐదారు ఏళ్ల తర్వాత అయినా కూడా హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడే అవకాశం ఉంది” పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ