కర్నూల్ లో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు, మైనార్టీ సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష

CM YS Jagan Held Review on Minority Welfare Department

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు మైనార్టీ సంక్షేమశాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్ భూములను సర్వే చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. మైనారిటీ సబ్ ప్లాన్ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కర్నూల్ లో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు, విజయవాడ గుంటూరు పరిసరాల్లో హజ్ హౌస్ ల నిర్మాణానికి సీఎం ఆమోదం తెలిపారు. మైనారిటీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై, అసంపూర్ణంగా నిలిచిపోయిన క్రిస్టియన్‌ భవన్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

వక్ఫ్‌ భూములపై పూర్తి స్ధాయిలో అధ్యయనం చేయాలి:

సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ మాట్లాడుతూ, వక్ఫ్‌ భూములపై పూర్తి స్ధాయిలో అధ్యయనం చేయాలన్నారు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణలో భాగంగా ఆ భూముల చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టాలని, ఉపాధి హామీ పథకం ద్వారా వీటి నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇమామ్‌లు, మౌజంలు, ఫాస్టర్లకు సకాలంలో గౌరవ వేతనాలు చెల్లింపులు జరగాలని, కొత్తగా వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమశాఖ) అంజద్‌ బాషా, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి గంధం చంద్రుడు, మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌ కె శారదా దేవి, ఏపీ సెంటర్‌ ఫర్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ సీఈఓ పి రవి సుభాష్, ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ అండ్‌ ఎండీ అలీం బాషా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ