ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అక్కడి నుంచి జనసేనాని పవన్‌కల్యాణ్ పోటీ చేస్తారని ప్రకటించినప్పటి నుంచీ ఉత్కంఠను రేపుతున్నాయి. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు చోట్లా పోటీ చేసినా పవన్ ఓడిపోయారు. ఈసారి కేవలం పిఠాపురం నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు. అక్కడ గెలుపు పక్కా అనే ధీమా పవన్ కు ఏర్పడడం.. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు తక్కువ ఉండడం ఇందుకు కారణం. ఈక్రమంలో పవన్ గెలుపును అడ్డుకోవడానికి అధికార పార్టీ కుట్రలకు పాల్పడుతోందని మొదటి నుంచీ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అందుకోసమే వైసీపీ ప్రత్యేక టీమ్‌ను పిఠాపురంలో దింపిందని జనసేన, తెలుగుదేశం నాయకులు పలు సందర్భాల్లో వెల్లడించారు.
కాపులు ఎక్కువగా ఉండడం.. అందులోనూ పవన్ అంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు సైతం పిఠాపురంలో ఉండడంతో అక్కడ జనసేన విజయం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈక్రమంలో పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడానికి వైసీపీ వ్యూహాలు పన్నుతోంది. ఆ వ్యూహాలు వెనుక కుట్రలూ దాగి ఉన్నాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఓడించేందుకు అధికార వైసిపి కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. రుణ బకాయిలు చెల్లిస్తారా? లేకుంటే వైసీపీకి మద్దతు ఇస్తారా? అంటూ డీసీసీబీ రికవరీ టాస్క్‌ఫోర్స్ అధికారులు నియోజకవర్గ ప్రజలపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారన్నారు.
వైసీపీకి మద్దతు ఇస్తే.. రుణ బకాయిలు అడగమని సదరు బ్యాంకు అధికారులు ప్రజలకు స్పష్టం చేస్తున్నారని వివరించారు. అయితే టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన రైతులను మాత్రమే బ్యాంక్ అధికారులు టార్గెట్ చేస్తున్నారని ఈ సందర్బంగా ఆయన మండిపడ్డారు. తీరు మార్చుకోకుంటే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని సదరు బ్యాంకు అధికారులకు వర్మ హెచ్చరించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీతను బరిలో ఉన్నారు. ఆమె ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు. పిఠాపురం ఎలాగైనా వైసీపీ ఖాతాలో పడే విధంగా జగన్ పార్టీ నాయకులు పకడ్బందీ ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE