రాష్ట్రంలో కీలక ప్రాంతమైన విజయవాడకు సమీపంలోని నియోజకవర్గం గన్నవరం. ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇద్దరూ.. ఇద్దరే. అంగ బలం, అర్థబలంలో సమఉజ్జీలు. గత ఎన్నికల్లో కూడా వారి మధ్యే పోటీ. అయితే అప్పుడు పార్టీలు వేరు. ఈక్రమంలో ఇక్కడి రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన యార్లగడ్డ వెంకట్రావు.. ప్రస్తుతం తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీడీపీకి కంచుకోట అయిన గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీచేయడంతో గెలుపు ఖాయమని యార్లగడ్డ ధీమాగా ఉన్నారు. అయినప్పటికీ హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ.. వైసీపీలో చేరి.. ఈఎన్నికల్లో ఆ పార్టీ నుంచే పోటీ చేస్తున్నారు. తాజా పరిణామాలతో గన్నవరం రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వ్యాపారరీత్యా అమెరికాలో స్థిరపడిన యార్లగడ్డ వెంకట్రావు అక్కడ పౌరసత్వాన్ని కూడా కాదనుకుని రాజకీయాలపై ఆసక్తితో సొంత జిల్లాకు వచ్చారు. వెంకట్రావు స్వగ్రామం పమిడిముక్కల మండలం పెనుమత్స. రాజకీయాలపై ఆసక్తితో 2014లో పెనమలూరు నియోజకవర్గ కేంద్రంగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
వాస్తవానికి 2019లో వెంకట్రావు పెనమలూరు నుంచి వైసీపీ టికెట్ ఆశించారు. కానీ.. అధిష్ఠానం ఆదేశాల మేరకు గన్నవరం నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ప్రత్యర్థి వంశీ చేతిలో కేవలం సుమారు 800 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. తొలి నుంచీ వంశీ అంటే ఉప్పు నిప్పుగా ఉండే వెంకట్రావు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను జీర్ణించుకోలేకపోయారు. ఇదే సమయంలో వంశీ వైసీపీ లో చేరారు. అప్పటి నుంచే 2024లో వైసీపీ గన్నవరం టికెట్ వంశీకే అని ప్రచారం మొదలైంది. దీంతో వెంకట్రావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎంతకాలం వేచి చూసినా వైసీపీ నుంచి సానుకూల సంకేతాలు లేకపోవడం.. పోతే పో.. అన్నట్టు నేతలు వ్యాఖ్యలు చేయడంతో వెంకట్రావు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరారు.
చేరే సమయంలో హామీ ఇచ్చినట్లుగానే.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గన్నవరం టికెట్ వెంకట్రావుకే ఇచ్చారు. మరోవైపు వైసీపీలో చేరిన వంశీయే ఆ పార్టీ అభ్యర్థిగా నిలిచారు. దీంతో 2019లో పోటీ పడిన ప్రత్యర్థులే మళ్లీ బరిలో నిలిచినట్లు అయింది. గత ఎన్నికల్లో కేవలం 800 లోపు ఓట్లతో వంశీపై ఓడిపోయిన వెంకట్రావు.. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే సీటు కైవసం చేసుకోవాలన్న కసితో ఉన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన వంశీ.. ఈ సారి అధికార పార్టీ నుంచి పోటీ చేస్తుండడంతో మళ్లీ గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన వంశీమోహన్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు. ఈక్రమంలో గన్నవరం రాజకీయాలు గరం గరంగా మారాయి. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY