ఏపీలో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగుదేశం-జనసేన పార్టీలు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. ఆదివారం రెండుసార్లు సమావేశమయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. త్వరలోనే మరోసారి సమావేశం కానున్నారు. అయితే జనసేనకు పోటీ చేయబోయే స్థానాలకు సంబంధించి పలు ఊహాగాణాలు వెలువడుతున్నాయి. 35 స్థానాలను చంద్రబాబు జనసేనకు కేటాయించినట్లు వార్తలొస్తున్నాయి.
ఈక్రమంలో కాపు ఉద్యమనేత హరిరామ జోగయ్య మరోసారి జనసేనాని పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. ఎన్నికల వేళ ఇప్పటికే పలుమార్లు పవన్‌కు లేఖ రాసిన హరిరామ జోగయ్య.. తాజాగా కాపుల ఆకాంక్షలు వివరిస్తూ మరోసారి లేఖ రాశారు. జనసేనకు తక్కువ సీట్లు కేటాయించారని వస్తున్న వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీని గద్దె దించడం అంటే చంద్రబాబు నాయుడిని గద్దె నెక్కించడమా? అని హరిరామ జోగయ్య ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో అధికారంలో జనసేన భాగస్వామ్యం కావాలన్న హరిరామ జోగయ్య.. అందుకోసం కనీసం యాభైకి స్థానాలు అయినా టీడీపీ నుంచి జనసేన తీసుకోవాలని స్పష్టం చేశారు.
యాభై కంటే తక్కువ సీట్లకు జనసేన అంగీకరిస్తే.. ఎన్నికల్లో ఓట్ల బదిలీ జరగదని పేర్కొన్నారు. అటు కాపులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎంతో ఆశతో పవన్ వైపు చూస్తున్నారని.. అందుకే సీట్ల విషయంలో ఏమాత్రం తగ్గొద్దని పవన్‌కు హరిరామ జోగయ్య సూచించారు. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఓడిందన్న హరిరామ జోగయ్య.. అందువల్ల పరస్పర అవసరాలు ఉన్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని సీట్ల పంపిణీ జరగాలని అన్నారు. సామాజిక న్యాయం సూత్రాల మీద సీట్ల పంపిణీ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం ఏపీలో పాతిక శాతం కాపులు, తెలగ, బలిజల సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారని.. వారంతా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. అందువల్ల అడుక్కునే స్థాయి నుంచి శాసించే స్థాయికి కాపులతో సహా బడుగు బలహీన వర్గాలు రావాల్సిన అవసరం ఎంతో ఉందని వివరించారు. ఈసారి ఎన్నికల్లో కాపులు, బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కాల్సిందేనని పేర్కొన్నారు. కాపులంతా పవన్ కళ్యాణ్‌పై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనసేన యాభైకి పైగా స్థానాలు దక్కించుకోవాలని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE