ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉపేక్షించేది లేదు, భరతం పడతాం : బాలకృష్ణ

Hindupur MLA, Actor Balakrishna Condemned Comments Made Against Bhuvaneswari, Warns YCP Leaders

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం శాసనసభలో పరిణామాలపై మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయిన విషయం తెలిసిందే. తన సతీమణిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసారంటూ ఆయన మీడియా సమావేశంలోనే కన్నీరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. తన కుటుంబసభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలన్నీ చాలా బాధాకరమని బాలకృష్ణ అన్నారు. సజావుగా రాష్ట్ర అభివృద్ధి కోసం జరగాల్సిన సమావేశాల్లో వ్యక్తిగత విమర్శలతో అజెండా అమలు చేయడం బాధాకరమన్నారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడి పెట్టుకోవటం తాము ఎప్పుడూ చూడలేదన్నారు. తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు దురదృష్టకరమని, వారు వాడుతున్న భాష చూస్తుంటే అసెంబ్లీలో ఉన్నామో, గొడ్ల చావిట్లో ఉన్నామో అర్థం కావడం లేదన్నారు. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారని, ఇలాంటి వ్యాఖ్యలు తగదన్నారు.

ఆడవాళ్ల జోలికొస్తే చేతులు కట్టుకుని కూర్చోలేదన్నారు. కొత్త నీచ సంస్కృతికి తెరలేపారని, ఆ పార్టీలోనూ కూడా బాధపడే వారున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మంచి సలహాలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడం లేదని, మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తామని బాలకృష్ణ హెచ్చరించారు. చంద్రబాబుపై పలు రకాలుగా దాడులు చేసినా ఆయన సంయమనంతో ఉన్నారు. అయితే ఇకపై ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఉపేక్షించేది లేదని అన్నారు. ఆడవాళ్లను తెరపైకి తెచ్చి రాజకీయాల్లో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని, మళ్లీ ఇలాంటి నీచమైన పదాలు వాడితే భరతం పడతామని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ