కర్ణాటక, తెలంగాణలో గెలుపుతో ఊపు మీదుంది కాంగ్రెస్ పార్టీ. అదే ఊపుతో ఏపీలో కూడా పట్టు సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో తమ హవా చాటాలని పావులు కదుపుతోంది. ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలను వైఎస్ షర్మిలకు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. షర్మిల నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని హైకమాండ్ గట్టిగా నమ్ముతోంది. అందుకే షర్మిలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో పాటు అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను కూడా షర్మిలకే అప్పగించింది.
ఇక షర్మిల కూడా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్నప్పటి నుంచి దూకుడుగా ముందుకెళ్తున్నారు. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తారు. మాజీ కాంగ్రెస్ నేతలను తిరిగి సొంత గూటికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సొంత గూటికి రావాలని.. తగిన ప్రాధాన్యత ఇస్తామని మాజీ నేతలకు షర్మిల సూచించారు. అలాగే కొందరు నేతల ఇళ్లకు స్వయంగా వెళ్లి.. వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.
అటు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో కదనరంగంలోకి దూకేందుకు షర్మిల సిద్ధమయ్యారు. ప్రజల్లోకి వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలో బస్సు యాత్రను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభించి.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వరకు కొనసాగించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా గతంలో కాంగ్రెస్ పార్టీ క్రౌడ్ ఫండింగ్ చేపట్టిన విషయం తెలిసిందే. డొనేట్ ఫర్ దేశ్ పేరుతో దేశవ్యాప్తంగా విరాళాలను సేకరిస్తోంది. ఇలానే కాంగ్రెస్ టికెట్ కావాలనుకునే వారు కూడా పార్టీకి విరాళాలు అందించాల్సి ఉంటుందని వైఎస్ షర్మిల వెల్లడించారు. జనరల్ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు రూ. 10 వేలు.. రిజర్వుడు స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారు రూ. 5 వేలు చెల్లించాల్సి ఉంటుందని షర్మిల ప్రకటించారు. అలాగే జనరల్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు రూ. 25 వేలు.. రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేయాలనుకునే వారు రూ. 15 వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY