జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాషను భావి తరాలకు వారసత్వ సంపదగా అందిద్దామని అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా, తెలుగు వాళ్ళం అని చెప్పుకోవడంలో భావోద్వేగం, సోదర భావం వెల్లడవుతాయి. ఇందుకు ఆలంబన మన భాష. అటువంటి అమ్మ భాషను అనునిత్యం మనం గౌరవించుకోవాలి. భావి తరాలకు వారసత్వ సంపదగా తెలుగు భాషను అందిస్తామని మనందరం సంకల్పించుకొని తెలుగు భాషా దినోత్సవానికి సార్ధకత చేకూరుద్దాం. గ్రాంథికంలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల బాట పట్టించి వ్యావహారిక భాషకు పట్టం కట్టిన మహనీయులు ఆ గిడుగు వెంకట రామమూర్తి గారు. ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకొంటున్నాం. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని అన్నారు.
“వ్యావహారిక తెలుగు భాష సొబగునీ, విలువనీ గుర్తింగి ఆ భాషను రచనల్లోకి తీసుకువచ్చేందుకు గిడుగు వెంకట రామమూర్తి ఉద్యమ స్ఫూర్తితో చేసిన కృషి వల్లే మన భాష విరాజిల్లుతోంది. ఆ స్ఫూర్తితోనే తెలుగు భాష పరిరక్షణకు పూనుకోవాలి. విద్యార్థి దశ నుంచే మన భాషను బాలలకు నేర్పించాలి. ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో సాగాలని కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని విస్మరించకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషను దూరం చేసే ప్రణాళికలపై భాషాభిమానులు, విద్యావేత్తలు అప్రమత్తం కావల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు తెలుగు నేర్పించడమే కాదు పాలన వ్యవహారాల్లో సైతం తెలుగు వాడుక పెందాలి. అన్ని వర్గాలవారూ తెలుగు భాష పరిరక్షణకు సన్నద్ధమైతేనే గిడుగు వెంకట రామమూర్తి గారికి నిజమైన నివాళి ఇవ్వగలం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY