ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక వరుసగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముందుగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు ఒకసారిగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ తర్వాత కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 12న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మార్చి 15లోపు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్ని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల పక్రియను కుదిస్తూ, నోటిఫికేషన్ వచ్చాక 15 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించేలా చట్టంలో మార్పులు తీసుకురానున్నారు. మార్చి 15 తర్వాత రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనుండడంతో ఆలోపే ఎన్నికల ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఏప్రిల్ లేదా మే నెలలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
మరోవైపు స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు తుది తీర్పు ఇవ్వగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ రామసుందర్‌రెడ్డి బుధవారం మీడియాకు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను పేపర్ బ్యాలెట్‌తోనే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. పంచాయితీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తుల ప్రమేయం లేకుండా ఫ్రీ గుర్తులు ఉపయోగిస్తామని తెలిపారు. అలాగే 13 జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు కావాల్సిన సామగ్రి అంతా సిద్ధంగా ఉందని రామసుందర్‌రెడ్డి తెలిపారు.
[subscribe]