
నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం కేసు ఏపీవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అదృశ్యానికి ముందు ఎంపీడీవో.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లెటర్ రాశారు. గత ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో పాటు..మాదవాయిపాలెం రేవు లీజుకు తీసుకున్న వ్యక్తులు ఏ విధంగా తనను వేధించారో లేఖలో వివరిస్తూ తన మనసులోని బాధను వెళ్లగక్కారు. 55లక్షల రూపాయల ఫెర్రీ లీజు బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లించాలని చినరెడ్డప్ప ధవేజీని తాను అడిగినట్లు..దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు తనను బెదిరించినట్లు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రసాదరావు అండదండలతోనే వారంతా బకాయిలు చెల్లించడం లేదని, దీనికి తననే ఇప్పుడు బాధ్యుడిని చేస్తారనే భయంతో వెళ్లిపోతున్నట్లు ఎంపీడీవో ఆవేదన వ్యక్తం చేశారు. 33 ఏళ్ల పాటు నిజాయతీగా సేవలు అందించానని, బకాయి సొమ్మును వారే చెల్లించేలా చూసి తగిన న్యాయం చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. తన పింఛన్ ప్రతిపాదన వచ్చేలా చేసి తన కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను మాత్రం కఠినంగా శిక్షించాలని ప్రార్థిస్తున్నట్లు లెటర్లో చెప్పారు.
తాజాగా ఈ సంఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్.. మాదవాయిపాలెం ఫెర్రీ బకాయి వివరాలను అందించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. నిందితులు ఎవరైనా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ హెచ్చరించారు. బాధితులే మళ్లీ బాధితులు కావడం చాలా బాధాకరమని అన్న పవన్ కళ్యాణ్ .. ఈ ఘటనపై విచారణ చేపట్టి నిందితులపై తగిన చర్యలు చేపడతామని చెప్పారు. అలాగే బాధిత కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్న పవన్.. ఎంపీడీవో కుటుంబసభ్యులు అధైర్య పడొద్దని హామీ ఇచ్చారు.
జులై 15న రాత్రి నుంచి అదృశ్యమైన ఎంపీడీవో వెంకటరమణ కోసం ఏపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆ రోజు రాత్రి మచిలీపట్నంలో ఉన్నట్లు కుటుంబసభ్యులకు చెప్పిన వెంకటరమణ.. ఆ తర్వాత రైలులో విజయవాడ మధురానగర్ వద్ద దిగారని సీసీటీపీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఫోన్ సిగ్నల్ ముత్యాలంపాడు వద్ద ఆగిపోవడంతో అక్కడకు దగ్గరలో ఉన్న ఏలూరు కాలువలో ఆయన దూకి ఉంటారేమో అనే అనుమానంతో ఏలూరు కాలువలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE