
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ఇప్పటికే వైసీపీ,టీడీపీలు తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇటు అధికార వైసీపీ అధినేత.. ఏపీ సీఎం జగన్ సిద్ధం అంటూ బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలను టీడీపీకి అండగా ఉండాలని కోరే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే రంగంలోకి దిగనున్నట్లు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న పవన్.. సీట్ల సర్దుబాటు అంశాలన్నీ పక్కనపెట్టి, ఏపీ సీఎంను ఓడించడమే ధ్యేయంగా ఎన్నికల ప్రచారానికి దిగనున్నారు.ఫిబ్రవరి 4న ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు.
ఏపీ వ్యాప్తంగా పర్యటించడంతో పాటు కీలకమైన కొన్ని జిల్లాలను టార్గెట్ చేసుకొని జనసేనాని తన ప్రచారాన్ని కొనసాగించనున్నారు. అక్కడ వారాహి యాత్రతో పాటు కుదిరితే కొన్ని నియోజకవర్గాల్లో కూడా పవన్ పాదయాత్ర కూడా చేయాలని నిర్ణయించుకున్నట్లు .. ఈ దిశగా ఇప్పటికే షెడ్యూల్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే జనసేనాని రూట్ మ్యాప్ రెడీ అయిపోయినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ ముందుగా అనకాపల్లి నియోజకవర్గం నుంచి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ ఎన్నికలలో అనకాపల్లి నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలలో ముందుగా పవన్ కళ్యాణ్ యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం అయింది.
అవసరాన్ని బట్టి మధ్యలో ఈ రూట్ మ్యాప్ మారే అవకాశం కూడా ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా పార్టీ నాయకులతో మరికొన్ని కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి ఈ యాత్రను కొనసాగించే ఆలోచన కూడా ఉంది.మరోవైపు ఎన్నికలలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి కూడా ప్రత్యేక టీం రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలను, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇటు ఫిబ్రవరి 4 నుంచి రంగంలోకి దిగనున్న పవన్ ..తన వారాహి యాత్రతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.దీంతో అసలైన ఎన్నికల వేడి రేగినట్లు అవుతుందని ఏపీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE