సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి స్పీడ్ పెంచేశాయి. అయితే సార్వత్రిక ఎన్నికలకంటే ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికలకు నగారా మోగింది. ఏపీ, తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా మొత్తం 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలయింది.
ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఆ తర్వాత 15వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 16వ తేదీన అధికారులు నామినేషన్లను పరిశీలించనుండగా.. 20వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఇచ్చారు. ఇక ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుండగా.. అదే రోజున అధికారులు ఓట్లు లెక్కించి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ప్రస్తుతం టీడీపీ తరుపున కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ తరుపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరుపున సీఎం రమేష్ ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. త్వరలోనే వారి పదవీకాలం పూర్తికానుంది. ఈక్రమంలో వారి స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ఈ ఎన్నికలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో మూడు రాజ్యసభ స్థానాలు వైసీపీకే దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈక్రమంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే ఈసారి మూడు స్థానాలు వైసీపీకే దక్కితే.. రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోనుంది. రాజ్యసభలో టీడీపీ ఎంపీల సంఖ్య జీరో అవుతుంది. ఈక్రమంలో చంద్రబాబు నాయుడు కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. వైసీపీలో సీట్లు దక్కక బయటికి వచ్చిన వారిని కలుపుకొని ఒక్క సీటు అయినా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో ఏపీలో రాజ్యసభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE








































