టికెట్ దక్కించుకోవడం.. ఎన్నికల్లో పోటీ చేయడమే నాయకుల చేతిలో ఉంటుంది. గెలుపోటములను డిసైడ్ చేసేది మాత్రం ప్రజలే. ప్రజానాయకులకు ఎప్పుడూ ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారు. మా నాయకుడు అని నమ్మిన నేతను భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు. కానీ ఒక్కసారి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటే.. ఆ నాయకుడి పథనం మొదలయినట్లే. ఆ తర్వాత నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రజావ్యతిరేకతను పోగొట్టుకోవడం కష్టమే. జాతీయ పార్టీ నుంచి పోటీ చేసినా ప్రజలు వారిని దూరం పెడుతూనే ఉంటారు. ఇప్పుడు తిరుపతి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ రావు పరిస్థితి కూడా అలానే ఉంది. వామ్మో వరప్రసాదా.. మాకొద్దంటే వద్దు అని అంటున్నారు తిరుపతి ప్రజలు.
గత ఎన్నికల్లో వైసీపీ తరుపున తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి వరప్రసాద్ గెలుపొందారు. గడిచిన అయిదేళ్లలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఎందుకు వరప్రసాద్‌కు ఓట్లు వేసి గెలిపించుకున్నాము.. అని ప్రజలు అనుకునేంతలా వ్యతిరేకతను తెచ్చుకున్నారు ఆయన. అవినీతి ఆరోపణలు కూడా ఆయనపై బాగానే ఉన్నాయి. అందుకే ఈసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరప్రసాద్‌ను దూరం పెట్టారు. టికెట్ ఇవ్వకుండా సైడ్ చేశారు. టికెట్ ఇవ్వబోమని జగన్ తేల్చడంతో అలకబూనిన వరప్రసాద్ పక్క పార్టీల వైపు చూడడం మొదలు పెట్టారు.
మొదట జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కలిశారు. కానీ జనసేన నుంచి ఎటువంటి టికెట్ హామీ లభించలేదు. ఆ తర్వాత ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. తిరుపతి ఎంపీ టికెట్ తనకు ఇప్పించాలని కోరారు. గతంలో ఆయన తిరుపతి ఎంపీగా పనిచేయడంతో పురందేశ్వరి కూడా అందుకు సరే అన్నారు. ఆ తర్వాత బీజేపీ హైకమాండ్‌ను కలవడం.. కాషాయపు పార్టీలో చేరిపోవడం.. టికెట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. కానీ తిరుపతిలో స్థానికంగా వరప్రసాద్‌పై ఉన్న వ్యతిరేకత మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
వరప్రసాద్‌కు బీజేపీ తిరుపతి ఎంపీ టికెట్ ఇవ్వడంతో.. స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో తిరుపతి ఎంపీగా వరప్రసాద్ పనిచేశారు. ఆ సమయంలో ఆయన చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వరప్రసాద్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అదే సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో స్థానిక ప్రజలు వరప్రసాద్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన సమర్థవంతమైన నాయకుడు కాదని తేల్చిచెబుతున్నారు. అటు బీజేపీ క్యాడర్ కూడా ఆయన్ను వ్యతిరేకిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పనిచేసేదే లేదని తిరుపతి బీజేపీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY






































