ఓటర్లకు జగన్ ఏం సమాధానం చెబుతారు?

CM Jagan, YS Jagan, voters, TDP, YCP, CONGRESS,JANASENA, ELECTIONS, BJP , Chandrababu, Pavan Kalyan, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
CM Jagan, YS Jagan, voters, TDP, YCP, CONGRESS,JANASENA, ELECTIONS, BJP , Chandrababu, Pavan Kalyan

టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు విమర్శించిన ఆ రెండు అంశాలే ఇప్పుడు జగన్ ప్రభుత్వం వైపు కూడా వేలెత్తి చూపిస్తున్నాయన్న వాదన  వినిపిస్తోంది. అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ ..ఇలా  రెండు ప్రభుత్వాలు మారినా.. ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారం చేపట్టినా  కూడా ఎవరూ వీటిని పూర్తి చేయకపోవడంపై ఏపీ వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడు చంద్రబాబు హయాంలో నిర్మాణం కానివి ..జగన్ పాలనలో  పూర్తవుతాయని ఆశ పడిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో.. ఈ రెండు నెలల్లో ఈ రెండు  పనులు పూర్తవ్వడానికి  అవకాశమే లేదు. దీంతో ఇదే విషయంపై జగన్ అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎంత లేదన్నా ఎన్నికలకు ముందు ఇవి వైసీపీకి తలనొప్పిగా మారనుండటం గ్యారంటీ అన్న వాదన వినిపిస్తోంది.

ఈ ఐదేళ్లలో ఏపీలో జగన్ ఏం చేశారని ప్రశ్నిస్తే.. బటన్ నొక్కడం తప్ప మరొక జవాబు కనిపించకుండా పోతోంది. మూడు రాజధానులకు న్యాయపరమైన వివాదాలున్నాయని చెబుతూ వస్తున్న  వైసీపీ బ్యాచ్.. పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయిందో చెప్పలేకపోతోంది.  2019 ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వానికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పగిస్తే మంచిదని చెప్పిన వైసీపీ నేతలు, తాము అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ మాటే మరచి పోయారు.

నిజానికి ఏపీ ప్రాణప్రదాయిని పోలవరంగా చెప్పొచ్చు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం కొంత పుంతలు తొక్కడం గ్యారంటీ. అంతేకాదు తాగు, సాగునీటికి ఇబ్బందుల నుంచి ఏపీ వాసులకు విముక్తి లభిస్తుంది. పేరుకు పోలవరం ప్రాజెక్ట్.. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు అయినా కూడా పదేళ్లవుతున్నా అది పూర్తి కాకపోవడంపై ఏపీ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించిన వైసీపీ .. అధికారంలోకి వచ్చాక గతానికి భిన్నంగా  చేసిందేమీ లేదన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

పోలవరం ప్రాజెక్టును స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభిస్తే.. తాము పూర్తి చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు దానిని పూర్తి చేయలేక చేతులెత్తేస్తోంది.  కేంద్రం నిధులు  విడుదల చేయకపోవడంతోనే తాము పోలవరాన్ని పూర్తి చేయలేకపోయామని  వైసీపీ నేతలు చెప్పినా కూడా ప్రజలు వినే పరిస్థితిలో లేరు. కేంద్రంతో తమకు కావాల్సిన  అన్ని పనులు చేయించుకునే జగన్.. పోలవరం ప్రాజెక్టుకు మాత్రం నిధులు ఎందుకు తీసుకురాలేకపోయారన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది.  నిర్వాసిత గ్రామాలవారికి కూడా సాయం అందించలేకపోయారంటే ఏ విధంగా అర్ధం చేసుకోవాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక..టీడీపీ ప్రభుత్వం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించి తాత్కాలిక భవనాలను కూడా నిర్మించింది. కానీ అమరావతి రాజధాని నిర్మాణం జరగలేదు. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత  దానిని పూర్తిగా పక్కన పెట్టేసింది. తాము అమరావతిని రాజధానిగా చేయడానికి వ్యతిరేకమని చెబుతూ..మూడు రాజధానులంటూ కొత్త రాగం అందుకుంది.

అయితే మూడు రాజధానుల గురించి సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించి నాలుగేళ్లవుతున్నా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీనికి న్యాయపరమైన వివాదాలే కారణమని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నా.. ఇటు ఏపీకి రాజధాని లేకుండా చేశారన్న అపవాదు మాత్రం జగన్ సర్కార్‌ను విడిచిపెట్టదు. మూడు రాజధానులు కాదు కదా ఒక్క రాజధాని కూడా లేకుండానే తన పాలనను పూర్తి చేసిన ఘనత జగన్‌కు మాత్రమే సొంతమనే మాటలను మూటకట్టుకున్నారు. ఉచిత పథకాలకు మాత్రమ పెద్దపీట వేసిన జగన్..రాష్ట్ర అభివృద్ధి పనులను పూర్తిగా పక్కన పెట్టేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ