
ఏపీ రాజకీయాలలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నియోజకవర్గం.. భీమవరం. అందుకే ఎప్పటిలాగే ఇప్పుడు కూడా అక్కడ రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేసి గెలుస్తారో.. రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ కొన్నేళ్లుగా కంటెన్యూ అవడమే. అయితే టఫ్ వార్ నడుస్తోన్న ఈ సమయంలో..రాష్ట్రంలో పవర్‌ను డిసైడ్ చేసే స్థానం అవడంతో భీమవరం రాజకీయాలు అప్పుడే హీటెక్కిపోతున్నాయి.
వాణిజ్య, రాజకీయ రాజధానిగా పశ్చిమ గోదావరి జిల్లాగా భీమవరానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాగే రాజకీయాల విషయానికి వస్తే..పశ్చిమగోదావరి జిల్లా రాజకీయమంతా.. భీమవరం నియోజకవర్గంలో ఉన్న కాపులు, రాజులు సామాజిక వర్గాలే శాసిస్తాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. భీమవరం నుంచి బరిలో దిగి ఓటమిని తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది.
2019 ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై.. వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ విశ్లేషకుల అంచనాలను తారుమారు చేసేలా విజయం సాధించారు. గ్రంధి శ్రీనివాస్ కు 70, 642 ఓట్లు పోల్ కాగా, పవన్ కళ్యాణ్ కు 62, 285ఓట్లు పోలయ్యాయి. అప్పుడు టీడీపీ నుంచి బరిలోకి దిగిన పులపర్తి రామాంజనేయులుకు 54, 37ఓట్లు పోలయ్యాయి. కేవలం 8,357 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించడం జనసైనికులను నిరాశ పరిచింది.
గతంలో జనసేన, టీడీపీ ఒంటరిగానే పోటీ చేయడం వల్ల టీడీపీ, జనసేన మధ్య ఓట్ల చీలిక.. గ్రంధి శ్రీనివాస్ విజయానికి కారణంగా మారింది. అయితే ఈసారి టీడీపీ, జనసేన కుదిరితే బీజేపీ కూడా కూటమిగా ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. అందుకే ఇప్పుడు భీమవరం నుంచి టీడీపీ,బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతారని తెలుస్తోంది. దీంతో ఈ సారి పవన్ కళ్యాణ్ విజయం గ్యారంటీ అని జనసైనికులు భావిస్తున్నారు.
దీనికితోడు ప్రజల్లో వైసీపీకి బీభత్సమైన నెగిటివిటీ తమకు అనుకూలంగా మారుతుందన్న లెక్కల్లో జనసేన ఉంది. అప్పుడు హీరోగానే తప్ప రాజకీయనేతగా పవన్ గురించి పూర్తిగా తెలియని ఓటర్లు.. పవన్‌ను దూరం పెట్టారని ఈ సారి అలాంటి పరిస్థితులు లేవని జనసేన భావిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే జనసేన నాయకులు భీమవరం నియోజకవర్గంలో జోరుగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పొత్తులలో భాగంగా టీడీపీ నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా భీమవరం గెలుపుపై భారీగానే ఆశలు పెంచుకున్నారు. ఇప్పటికే స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా.. నియోజకవర్గంలో వైసీపీ పథకాలను బలంగా క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెంచుకోవడంలోనూ గ్రంధి ముందే ఉన్నారు. ఈ రెండు అంశాలే వైసీపీకి ఉపయోగపడతాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల సమయంలో భీమవరంలో టఫ్ వార్ తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE






































