దేశ చరిత్రలోనే తొలిసారి ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. యాభైకి పైగా సిట్టింగ్‌లను మార్చేసిన జగన్.. మార్పు ప్రక్రియను ఇంకా కొనసాగిస్తున్నారు. మరికొంత మందిని మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇంఛార్జ్‌ల మార్పు వైసీపీలో కాకరేపుతోంది. టికెట్ దక్కని వారు.. టికెట్ ఆశించి భంగపడినవారంతా ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.
నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే తొగురు ఆర్ధర్‌కు ఈసారి జగన్ షాక్ ఇచ్చారు. ఇంచార్జ్‌ల మార్పులో భాగంగా ఆయన్ను పక్కకు పెట్టేశారు. ఈసారి నందకొట్కూర్ ఇంఛార్జ్‌గా కొత్త వారికి అవకాశం కల్పించారు. దీంతో ఆర్ధర్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇటీవల బహరింగంగానే తన అసంతృప్తిని వ్యక్త పరిచిన ఆర్ధర్.. సీఎం జగన్, భైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పెత్తనమంతా బైరెడ్డి సిద్ధార్డ్ రెడ్డిదేనని.. ఆ విషయంపై నిలదీసినందుకే తనను పక్కకు పెట్టారని ఆర్ధర్ ఆరోపించారు.
జిల్లాలో తన గ్రాఫ్ బాగానే ఉందని.. సర్వేలు కూడా అదే చెబుతన్నాయని ఆర్ధర్ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు కూడా తనకే టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ తనకు టికెట్ ఇవ్వకుండా నికారించారని.. చాలా దళిత నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందని ఆర్ధర్ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా తాను వైసీపీనే నమ్ముకొని ఉన్నానని చెప్పుకొచ్చారు.
అయితే వైసీపీ హైకమాండ్ ఆర్థర్‌ను పక్కకు పెట్టేయడంతో.. ఆయన తెలుగు దేశం పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి టీడీపీ నేతలతో ఆర్ధర్ మంతనాలు జరిపారట. చంద్రబాబు నాయుడు కూడా ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలాగే నందకొట్కూరు టికెట్ కూడా ఆర్ధర్‌కు ఇచ్చే దానిపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట. మరోవైపు ఆదివారం ఆర్ధర్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరికను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE