ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌సీపీ ప్లీనరీ పండుగ శుక్రవారం గుంటూరులో ఘనంగా ప్రారంభమైంది. జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న విశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అగ్రనేతలతో పాటు జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. అలాగే సీఎం జగన్ మాతృమూర్తి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్లీనరీని ప్రారంభించారు.
అనంతరం లక్షలాదిగా హాజరైన పార్టీ శ్రేణులనుద్దేశించి సీఎం జగన్ ప్రారంభోపన్యాసం చేస్తూ.. వైఎస్సార్ ఆశయాల సాధన కోసమే పార్టీ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు వందనం అని అన్నారు. 2009 సెప్టెంబర్ 25న పావురాల గుట్టలో వైఎస్సార్ అసువులు బాసిన తర్వాత చేపట్టిన ఓదార్పు యాత్రతో పార్టీకి తొలి బీజం పడిందని వెల్లడించారు. ఈ 13 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో కఠిన సవాళ్లు ఎదుర్కొన్నామని, అనేక రకాల కుట్రలు, దాడులు జరిగినా భయపడలేదని తెలిపారు.
ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2014 నుంచి 2019 మధ్య మన పార్టీ ఎన్నో నిందలను, అవమానాలను భరించిందని చెప్పారు. అయినాసరే ప్రజలు మన పక్షాన ఉండటంతో 2019లో జరిగిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించామని గుర్తు చేశారు. 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో విజయం సాధించామని, ప్రతిపక్షం కేవలం 23 స్థానాలకు పరిమితమైందని తెలిపారు. ఇదే స్పూర్తితో అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రజలకు సేవ చేస్తున్నామని, పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా హామీలు నెరవేరుస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ