తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దన్నపాత్ర పోషించిన స్టార్ హీరో, డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయ్ కాంత్ మరణించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించడంతో.. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. కెప్టెన్ మరణంతో తమిళ సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది.
కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు గురైన విజయ్ కాంత్.. 20 రోజుల పాటు వెంటిలేటర్‌పై పోరాడి బయటపడ్డారు. అయితే ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చిన కొద్దిరోజులకు మరోసారి విజయ్ కాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వైద్యులు విజయ్ కాంత్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా సోకినట్లుగా నిర్ధారించారు. రోజురోజుకు ఆయన ఆరోగ్యం మరింత క్షిణిస్తుండడంతో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చివరికి ఆయన్ను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన ఫలితాలన్నీ ఫలించకపోవడంతో.. విజయ్ కాంత్ తుదిశ్వాస విడిచారు.
ఇకపోతే 25 ఆగష్టు 1952లో విజయ్ కాంత్ జన్మించారు. 1979లో ‘ఇనిక్కుం ఇలామై’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 100కు పైగా సినిమాల్లో విజయ్ కాంత్ నటించగా.. అందులో 20కి పైగా పోలీస్ కథల్లోనే విజయ్ కాంత్ నటించి ప్రేక్షకులను అలరించారు. విజయ్ కాంత్ 100వ సినిమా ‘కెప్టెన్ ప్రభాకర్’. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి అభిమానులు ఆయన్ను కెప్టెన్ విజయ్ కాంత్ అని పిలుచుకుకోవడం మొదలు పెట్టారు. ఇండస్ట్రీలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించి.. ఎంతో మందిని హీరోలుగా నిలబెట్టి.. తమిళ ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషించారు విజయ్ కాంత్.
సినిమాలతో అలరిస్తూనే.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విజయ్ కాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది విజయ్ కాంత్ అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారు. ఇక కొద్దిరోజులుగా ఆయన్ను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో.. ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. బహిరంగ సమావేశాలు, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో కన్నుమూశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE