దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మార్చి 12, 2021 నుండి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటుగా వేడుకలు నిర్వహించనున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో మార్చి 12, 1930 లో జరిగిన చారిత్రాత్మక ఉప్పు సత్యాగ్రాహ 91వ వార్షికోత్సవమైన ఈ రోజున (మార్చి 12, శుక్రవారం-2021 ) ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో జరిపే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రధాని మోదీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో భాగంగా అహ్మదాబాద్‌లోని అభయ్ ఘాట్ నుండి దండి మార్చ్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుండి నవసరిలోని దండి వరకు సుమారు 388 కిలోమీటర్ల వరకు పాదయాత్ర (దండి మార్చ్) సాగనుంది. 81 మందితో ప్రారంభమయ్యే ఈ దండి మార్చ్ మార్చి 12 నుంచి ఏప్రిల్ 5 వరకు 25 రోజుల పాటుగా జరగనుంది. ఈ మార్చ్ సందర్భంగా మార్గమధ్యంలో ప్రజలు కూడా పెద్దఎత్తున పాల్గొననున్నారు. అలాగే 81 మందితో కూడిన మరోక బృందంతో మొదటి 75 కిలోమీటర్ల పాదయాత్రకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ నాయకత్వం వహించనున్నారు. మరోవైపు 75 వారాల పాటుగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. వేడుకల్లో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలు, విధి విధానాలు, ప్రణాళిక రూపకల్పన కోసం ప్రధాని మోదీ చైర్మన్ గా దేశంలో 259 మంది ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి జాతీయ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తోలి సమావేశం మార్చి 8, 2021న నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ