కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, విశాఖఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు రేపు (మార్చి 26, శుక్రవారం) భారత్ బంద్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా పలు పార్టీలు బంద్ కు మద్ధతు తెలిపాయి. రేపు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నారు. ఈ భారత్ బంద్ విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా దేశ పౌరులకు పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో రైలు ప్రయాణాలు, రోడ్డు రవాణా సేవలు ప్రభావితం కానున్నాయి. అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార సభలు నడుస్తుండడంతో తమిళనాడు, అస్సాం, పశ్చిమబెంగాల్, కేరళ మరియు పుదుచ్చేరిలలో బంద్ పాటించవద్దని పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది.
మరోవైపు రైతులు, కార్మికులు తలపెట్టిన భారత్ బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా ఏపీ రాష్ట్రప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఇటీవలే ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. భారత్ బంద్ నేపథ్యంలో శుక్రవారం నాడు ఏపీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే భారత్ బంద్ కు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు తెలిపింది. బంద్ లో పాల్గొని రైతులు, కార్మికులు మద్దతు ఇవ్వాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా పలు వ్యాపార, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వాహనా యాజమానుల సంఘాలు, ఇతర వర్గాలు భారత్ బంద్ కు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ