దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరూ కూడా ఏప్రిల్ 10, 2022 నుంచి ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉండి, రెండవ డోస్ తీసుకుని 9 నెలల పూర్తయిన వారందరూ అర్హులని, వారికీ ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రమే ప్రికాషన్ డోస్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ‘కోవిషీల్డ్’ కరోనా వ్యాక్సిన్ అందించిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ, ‘కోవాక్జిన్’ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సంస్థలు వ్యాక్సిన్ ధరలపై కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో/ఆసుపత్రుల్లో కోవిషీల్డ్, కోవాక్జిన్ వ్యాక్సిన్ల ధర రూ.225 గా ఉండనున్నట్టు ప్రకటించాయి.
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ సీ పూనావాలా ట్విట్టర్ వేదికగా ప్రకటన చేస్తూ, “కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను ఒక్కో డోసుకు రూ.600 నుండి రూ.225కి సవరించాలని సంస్థ నిర్ణయించిందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. 18 ఏళ్లు పైబడినవారికి ప్రికాషన్ డోస్ ఇచ్చేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మేము మరోసారి అభినందిస్తున్నాము” అని పేర్కొన్నారు.
అలాగే భారత్ బయోటెక్ సంస్థ కోఫౌండర్ అండ్ జేఎండీ సుచిత్ర ఎల్లా ట్వీట్ చేస్తూ, “పెద్దలందరికీ ప్రికాషన్ డోస్ అందుబాటులో ఉంచాలనే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం ప్రైవేట్ ఆసుపత్రుల కోసం కోవాక్జిన్ వ్యాక్సిన్ ధరను ఒక్కో డోసుకు రూ.1200 నుండి రూ.225కి సవరించాలని మేము నిర్ణయించుకున్నాము” అని తెలిపారు. కాగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధర రూ.225 తో పాటుగా సర్వీసు చార్జీలు గరిష్టంగా రూ.150 తీసుకోనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ