దేశ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24, 2022 తో ముగియనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం ముగియక ముందే తదుపరి రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నిక షెడ్యూల్ ప్రకటిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ జరుగుతుందని, జూలై 21వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.
2022 రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 4,809 మంది ఓటర్లు ఉన్నారని, ఈ ఎన్నిక విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా తమ సభ్యులకు విప్ జారీ చేయకూడదని సూచించారు. ఎలెక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులు, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం మరియు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఎన్నికైన శాసన సభ్యులు ఉండనున్నారు. ఈ ఎన్నిక బ్యాలెట్ పేపర్ విధానంలో జరగనుంది. ఎంపీ ఓటు విలువ 700 కాగా, 16వ రాష్ట్రపతి ఎన్నికలో ఓటర్ల మొత్తం విలువ 10,86,431 గా ఉంది. ఇందులో 4033 ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 5,43,231 కాగా, 776 ఎంపీల మొత్తం ఓట్ల విలువ 5,43,200 అని తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ వివరాలు:
- రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్: జూన్ 15, 2022
- నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు: జూన్ 29
- రాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన: జూన్ 30
- నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: జూలై 2
- రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహణ: జూలై 18
- ఓట్ల లెక్కింపు పక్రియ: జూలై 21
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY