ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 లో ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. శనివారం రాత్రి బ్రెజిల్, క్రొయేషియా మధ్య జరిగిన ఉత్కంఠభరిత క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో క్రొయేషియా, అర్ధరాత్రి నెదర్లాండ్స్, అర్జెంటీనా మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ లో అర్జెంటీనా సంచలన విజయాలు సాధించాయి. దీంతో అర్జెంటీనా, క్రొయేషియా జట్లు ఫిఫా ప్రపంచ కప్-2022 సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.
ముందుగా శుక్రవారం రాత్రి క్రొయేషియా ఫిఫా ప్రపంచకప్-2022లో మరో సంచలనం నమోదు చేసింది. 5 సార్లు ఫిఫా ఛాంపియన్, ర్యాకింగ్స్‌లో నంబర్ 1, టైటిల్ ఫేవరేట్ బ్రెజిల్ జట్టును క్రొయేషియా ఓడించి సెమీస్ కి చేరింది. ఇరు జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగగా క్రొయేషియా జట్టు పెనాల్టీ షూటౌట్లో 4-2 తో బ్రెజిల్ జట్టును మట్టికరిపించింది. దీంతో కప్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రెజిల్ ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర నిరాశలో మునిగారు. ఈ మ్యాచ్ లో ముందుగా నిర్ణీత సమయంలో ఇరు జట్లూ గోల్స్ కొట్టలేకపోగా, అదనపు సమయంలో బ్రెజిల్ నుంచి స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ ఓ గోల్ చేయగా, అనంతరం క్రొయేషియా ఆటగాడు పెట్కోవిచ్ గోల్ సాధించడంతో స్కోరు 1-1తో సమమైంది. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యం కాగా క్రొయేషియా యొక్క నలుగురు పెనాల్టీ టేకర్లలో నికోలా వ్లాసిక్, లోవ్రో మేజర్, లుకా మోడ్రిక్, మిస్లావ్ ఓర్సిక్ ప్రతి ఒక్కరు గోల్ చేయగా, బ్రెజిల్ నుంచి కసేమేరో, పెడ్రో మాత్రమే గోల్స్ సాధించారు. దీంతో 4-2 తో క్రొయేషియా జట్టు ఖాతాలో సంచలన విజయం చేరింది. బ్రెజిల్ ఆటగాడు రోడ్రిగో యొక్క ఓపెనింగ్ పెనాల్టీని క్రొయేషియా గోల్ కీపర్ డొమినిక్ లివాకోవిచ్ సేవ్ చేసి, ఈ మ్యాచ్ కు హీరోగా నిలిచాడు.
మరోవైపు అర్జెంటీనా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్ లో 4-3 (2-2)తో నెదర్లాండ్స్‌ను ఓడించి సెమీఫైనల్ లోకి ప్రవేశించింది. ఈ రాత్రి 8.30 గంటల నుంచి మొరాకో,పోర్చుగల్ మధ్య, అర్ధరాత్రి 12.30 గంటలకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మధ్య మిగతా రెండు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక డిసెంబర్ 14 అర్ధరాత్రి 12.30 గంటలకు జరగున్న తొలి సెమీఫైనల్ లో అర్జెంటీనా, క్రొయేషియా జట్లు తలపడనున్నాయి. సంచలనాలు నమోదవుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022లో ఏ జట్లు ఫైనల్స్ కు చేరనున్నాయో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE