ఫిఫా వరల్డ్‌కప్‌లో సంచలనం నమోదైంది. వరల్డ్‌కప్ ఫెవరెట్ జట్లలో ఒకటైన అర్జెంటీనాపై పసికూన సౌదీ అరేబియా జట్టు 2-1 తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్ సిలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా ఫస్ట్ హాఫ్‌లో పైచేయి సాధించింది. ఆట మొదలైన 10వ నిమిషంలోనే వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ గోల్ చేయడంతో అర్జెంటీనా 1-0 లీడ్‌లోకి వెళ్ళింది. అయితే సెకండాఫ్‌లో సౌదీ అరేబియా అనూహ్యంగా పుంజుకుంది. ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు అద్భుతమైన గోల్స్ చేయడంతో సౌదీ ఆధిక్యంలోకి వచ్చింది. సెకండాఫ్ ప్రారంభమైన తర్వాత ఆట 48వ నిమిషంలో సలే అల్ హెహ్రీ సౌదీ తొలి గోల్ చేయగా.. 53వ నిమిషంలో సలేమ్ అల్ దౌసారి మరో గోల్ చేశాడు. ఈ క్రమంలో ఆట చివరి వరకు సౌదీ ఆధిక్యం నిలుపుకోవడంతో విజయం సొంతం చేసుకుంది.
దీంతో సౌదీ రాజధాని రియాద్ అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా బుధవారం జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ సెలవు ఉంటుందని సౌదీ రాజు సల్మాన్ ఈరోజు ప్రకటించారు. అలాగే అన్ని పాఠశాలలు, కాలేజీలు కూడా మూసివేయనున్నారు. కాగా ప్రస్తుతం దేశంలో సంవత్సరాంతపు పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో వాటిని రీషెడ్యూల్ చేయనున్నారు. ఇంకా నగరంలోని ప్రధాన థీమ్ పార్కులు మరియు వినోద కేంద్రాలలో ప్రవేశ రుసుము మాఫీ చేయబడుతుందని రాయల్ కోర్ట్ సలహాదారు మరియు సౌదీ అరేబియా జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ అథారిటీ అధిపతి టర్కీ అల్-షేక్ ట్విట్టర్‌లో ప్రకటించారు. ఇక ఇదిలా ఉండగా అర్జెంటీనా తన తదుపరి మ్యాచ్‌లను గ్రూప్ సి లోని బలమైన మెక్సికో, పోలాండ్ టీమ్స్‌తో ఆడాల్సి ఉంది. దీంతో ఆ టీమ్ నాకౌట్ స్టేజ్‌కు చేరుకోవాలంటే పూర్తి స్థాయిలో పోరాడవలసి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE