
మనిషి చంద్రుడిపై కాలు పెట్టాడు.. ఇక సూర్యుడు, సముద్రం లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయోనని తేల్చుకోవడానికి త్వరలోనే రెడీ అవబోతున్నాడు. మకసైన్స్‌లో ఇంత పురోగతి సాధించినా కూడా ఇప్పటికీ సముద్రం లోపల ఎన్నో వింతలు, విడ్డూరాల రహస్యాలు అంతు చిక్కకుండానే ఉన్నాయి. సముద్రంలో ఉంటున్న జీవుల గురించి చాలా మందికి తెలియదు. జలచరాల జీవితానికి సంబంధించిన విషయాలు నేటికి మిస్టరీగానే ఉన్నాయి.
బ్లూ వేల్ ప్రపంచంలోనే అతిపెద్ద జీవులుగా గుర్తించబడ్డాయి. నిజానికి సముద్రంలో లెక్కలేనన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. సముద్రం అడుగున శాస్త్రవేత్తలు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.అలా ప్రపంచంలోని అతిపెద్ద జంతువు అంటార్కిటిక్ బ్లూ వేల్‌ని గుర్తించారు. ఉత్తర పసిఫిక్, దక్షిణ మహాసముద్రం, భారతీయ దక్షిణ పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రంలో మాత్రమే నీలి తిమింగలాలు కనిపిస్తాయి.
బ్లూ వేల్ బరువు సుమారు 4,00,000 పౌండ్లు ఉంటుందట. అంటే.. ఒక తిమింగలం 33 ఏనుగుల బరువు ఉంటుందన్నమాట. అలాగే సుమారు 98 అడుగుల పొడవు ఉంటుంది. ఈ నీలి తిమింగలం గుండె.. కారు అంత పెద్దదిగా ఉండటంతో పాటు.. దాని నాలుక ఏనుగు అంత బరువు ఉంటుంది. అందుకే ఇది భూమిపై అతిపెద్ద జంతువుగా ఇది గుర్తింపు పొందింది.
అంతెందుకు డైనోసార్ల కంటే బ్లూవేల్ సైజు పెద్దదిగా ఉంటుంది. ఒక అధ్యయనంలో.. అతిపెద్ద డైనోసార్ అస్థిపంజరం పొడవు 27 మీటర్లు అని వెల్లడి అయింది. కానీ తిమింగలం పొడవు 30 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు నీలి తిమింగలాలు 80 ఏళ్ల నుంచి 90 ఏళ్లు జీవిస్తాయి. దీనికి మొప్పలు ఉండవు కాబట్టి.. నిమిషానికి ఒకసారి ఊపిరి పీల్చుకోవడానికి నీటి ఉపరితలంపైకి వస్తూ ఉంటాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నీలి తిమింగలం క్షీరదం. అంటే బ్లూ వేల్ తన పిల్లలకు పాలిచ్చి పెంచే జంతువు. బ్లూ వేల్ భూమిపై అతిపెద్ద జంతువు మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్వరం కలిగిన జంతువుగానూ గుర్తింపబడింది. నీలి తిమింగలం నుంచి వచ్చే స్వరం తాలూకా శబ్ధం.. జెట్ ఇంజిన్ కంటే బిగ్గరగా ఉంటుందట. అందుకే ఇది వందల మైళ్ల దూరం వరకూ వినబడుతుంది. సాధారణంగా జెట్ ఇంజిన్ 140 డెసిబుల్స్ వరకు ధ్వనిని ఉత్పత్తి చేయగలదని అంటారు. దీనికి మించి అంటే ఈ నీలి తిమింగలం 188 డెసిబుల్స్ ధ్వనిని ఉత్పత్తి చేస్తుందట.