ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలు కలిగిన దేశం ఇజ్రాయెల్. అగ్రరాజ్యాల వద్ద కూడా లేని ఆయుధాలు ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి. అటువంటి ఇజ్రాయెల్‌పై పాలస్తీనా, హమాస్ మిలిటెంట్ల దండయాత్ర కొనసాగుతోంది. రోజురోజుకు యుద్ధం భీకరంగా మారుతోంది. హమాస్ మిలిటెంట్లు రాకెట్లతో ఇజ్రాయెల్‌కు తూట్లు పొడుస్తున్నారు. మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ యుద్ధం ఇప్పుడు భారత్‌లో పొలిటికల్ వార్‌కు దారి తీసింది. యుద్ధంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా తమ అభిప్రాయం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.
ఇజ్రాయెల్‌పై పాలస్తీనా, హమాస్ మిలిటెంట్లు చేస్తున్న దండయాత్రను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. భారత్ కూడా ఈ యుద్థాన్ని ఖండిస్తూ.. ఇజ్రాయెల్‌కు మద్ధతు ప్రకటించింది. అయితే అదే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మాత్రం ఇందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు కాకుండా.. పాలస్తీనాకు కాంగ్రెస్ మద్ధతు ఇచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఉగ్రవాదులకు కాంగ్రెస్ ఊత మిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే తమపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు కాంగ్రెస్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. నెటిజన్లు ఏమాత్రం తగ్గడం లేదు. కాంగ్రెస్‌పై కామెంట్లతో దండయాత్ర చేస్తూనే ఉన్నారు.
ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తున్న క్రమంలో బీజేపీ నేత తేజస్వి సూర్య సంచలన పోస్ట్ పెట్టారు. యుద్ధంపై కూడా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని తేజస్వి సూర్య ఆరోపించారు. పాలస్తీనాకు కాంగ్రెస్ మద్ధతు ప్రకటించడం.. మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు చక్కటి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ దేశ విదేశాంగ విధానాన్ని తాకట్టు పెట్టిందన్న సూర్య.. ప్రధాని మోడీ వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
అయితే తేజస్వి సూర్య పెట్టిన పోస్టుకు అటు కాంగ్రెస్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. పాలస్తీనాకు మద్ధతుగా గతేడాది మోడీ రాసిన లేఖను కాంగ్రెస్ ఇప్పుడు బయటపెట్టింది. పాలస్తీనా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి భారత్ చేస్తున్న సాయాన్ని మోడీ లేఖలో ప్రస్తావించారు. అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న సుహృద్భావ సంబంధాలను కూడా లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను బయట పెట్టిన కాంగ్రెస్.. బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని మండిపడింది. అప్పుడు పాలస్తీనాకు మద్ధతు ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు ఇజ్రాయెల్‌కు ఎలా ఇస్తుందని నిలదీసింది.