రేపే ఘనంగా టోక్యో ఒలింపిక్స్‌-2020 ప్రారంభం

Tokyo Olympics 2020 Starts From Tomorrow

జపాన్‌ లోని టోక్యో నగరంలో జూలై 23, 2021 నుంచి ఆగస్టు 8, 2021 వరకు ఒలింపిక్స్‌ క్రీడలు జరగనున్నాయి. ఒలింపిక్స్‌ మహా క్రీడా సంబరం రేపు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ క్రీడల్లో 200 కి పైగా దేశాలు పాల్గొంటుండగా, 500 కి పైగా ఈవెంట్లు జరగనున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ 2020 ప్రారంభోత్సవ కార్యక్రమం 1000 మందిలోపు అతిథులతోనే నిర్వహిస్తుండగా, భారత్ వైపు నుండి సుమారు 50 మంది హాజరుకానున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఈ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌ భారత్‌ లో సోనీ నెట్‌వర్క్‌ లో ప్రసారం కానున్నాయి. అలాగే భారత్ క్రీడాకారుల ఈవెంట్స్ దూరదర్శన్‌ స్పోర్ట్స్‌ చానెల్‌ కూడా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

ఈసారి భారత్ నుంచి 18 క్రీడా విభాగాలలో మొత్తం 126 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌ లో పాల్గొననున్నారు. ఒలింపిక్ క్రీడోత్సవాలలో ఇప్పటివరకు భారత్ నుంచి వెళ్లిన దళాలన్నిటిలోకీ ఇదే అతి పెద్ద దళం. 18 వేరు వేరు క్రీడా విభాగాలలో మొత్తం 69 పోటీలలో భారత్ ఆటగాళ్లు పాల్గొననున్నారు. అలాగే వివిధ ఆటలలో భారత్ తరఫున ఆటగాళ్లు మొదటిసారి పాల్గొనడం జరుగుతుంది. ఫెన్సింగ్‌ విభాగంలో భవానీ దేవి, సెయిలర్‌ గా నేత్ర కుమారన్‌, స్విమ్మింగ్‌ విభాగంలో సాజన్‌ ప్రకాశ్‌, శ్రీహరి నటరాజ్‌ లు భారత్ తరపున ఆయా విభాగాల్లో తొలిసారిగా పాల్గొంటున్నారు.

ఇక జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు ప్రతీ రోజు భారత్ క్రీడాకారుల ఈవెంట్స్ ఉన్నాయి. తొలిరోజున (జూలై 23) భారత్ ఆర్చరీ క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. ఉదయం 5.30 గంటలకు మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్‌లో దీపిక కుమారి, ఉదయం 9.30 గంటలకు పురుషుల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్‌లో అతను దాస్, తరుణదీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ