కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించబడింది. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ అగ్ర నాయకుడు మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. కాగా అమిత్ షా వారసుడిగా 2020లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నడ్డా మూడేళ్ల పదవీకాలం ఈ ఏడాది జనవరి 20న ముగియనున్న నేపథ్యంలో ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదిలో పలు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు సహా 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టి పెట్టుకుని నడ్డాను కొనసాగించడానికే పార్టీ భావించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ.. జేపీ నడ్డా నాయకత్వంలో బీజేపీ బీహార్‌లో, మహారాష్ట్రలో మెజారిటీ సాధించిందని, ఉత్తరప్రదేశ్‌ మరియు గుజరాత్‌లో ఘనవిజయం సాధించామని గుర్తుచేశారు. ఇంకా పశ్చిమ బెంగాల్‌లో పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిందని ఆయన తెలిపారు. అనంతరం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో నడ్డా మాట్లాడుతూ.. ఈ ఏడాది మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో విజయం సాధించేందుకు ఎన్నికలకు సన్నద్ధం కావాలని మొత్తం కార్యవర్గానికి నడ్డా పిలుపునిచ్చారు. అలాగే ఆ తర్వాత 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇక వలసవాద గత జాడల నుండి విముక్తి మరియు అభివృద్ధి చెందిన దేశంగా ఇండియాను నిలపడానికి నిబద్ధత, భిన్నత్వంలో ఏకత్వం మరియు పౌరులను బాధ్యతాయుతంగా చేయడం వంటి అంశాలతో కూడిన పంచప్రాణ్‌ను ప్రధాని మోదీ తీసుకొచ్చారని నడ్డా తెలిపారు.

ఇంకా నడ్డా మాట్లాడుతూ.. భారతదేశం బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, అంతేకాకుండా మొబైల్ ఫోన్‌ల తయారీలో భారతదేశం రెండవ అతిపెద్ద దేశంగా అవతరించిందని అలాగే దేశంలో ఉపయోగించే మొబైల్ ఫోన్‌లలో 95 శాతానికి పైగా భారతదేశంలోనే తయారు చేయబడుతున్నాయని వివరించారు. బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న మరియు అమలుచేస్తున్న కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందని జేపీ నడ్డా వివరించారు. ఇక ఇదిలావుండగా, దేశ రాజధానిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడంతో, ఎన్నికలకు వెళ్లే నాలుగు రాష్ట్రాల పార్టీ చీఫ్‌లు అగ్రనాయకత్వం ముందు గ్రౌండ్‌ రిపోర్టును సమర్పించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + eighteen =