త్రిపుర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు (ఫిబ్రవరి 16, గురువారం) ఒకే విడతలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గురువారం ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కానుండగా, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. త్రిపురలో సాధారణ ఓటర్లు సంఖ్య 28,13,478, సర్వీస్ ఓటర్ల సంఖ్య 10,344 కలిపి మొత్తం 28,23,822 ఓటర్లు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ పక్రియ కోసం మొత్తం 3,328 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. త్రిపురలో రేపు అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ మెటీరియల్‌తో పాటుగా పోలింగ్ సిబ్బంది కూడా పోలింగ్ బూత్‌లకు చేరుకుంటున్నారు. త్రిపుర రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద కేంద్ర సాయుధ పోలీసు బలగాలను కూడా ఈసీ మోహరించింది. అలాగే స్థానిక, మరియు సరిహద్దు భద్రతా దళాలతో కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు.
త్రిపురలో ఈసారి అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరియు ఐపీఎఫ్టీ పొత్తులో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేయగా, ఐపీఎఫ్‌టీకి ఆరు చోట్ల పోటీ చేస్తుంది. అలాగే త్రిపురలో తొలిసారిగా సీపీఎం, కాంగ్రెస్ పొత్తుగా పోటీ చేస్తున్నాయి. సీపీఎం 47 నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ 13 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక ఓ స్వతంత్ర అభ్యర్థికి ఇరూ పార్టీలు మద్దతిస్తున్నాయి. ఇక రీజినల్ పార్టీ టిప్రా మోతా 60 నియోజకవర్గాలకు గానూ 42 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా 28 స్థానాల్లో బరిలో ఉన్నారు. త్రిపుర ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి 20 మంది మహిళలు సహా మొత్తం 259 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.
అయితే త్రిపురలో బీజేపీ, సీపీఎం, టిప్రా మోతా పార్టీల మధ్యనే కీలక త్రిముఖ పోటీ నెలకుంది. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 36, సీపీఎం 16, ఐపీఎఫ్టీ 8 స్థానాలను దక్కించుకున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, సీపీఎం విస్తృత ప్రచారం నిర్వహించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ త్రిపుర ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించారు. ఈ ఎన్నికల్లో సీఎం మాణిక్ సాహా, డిప్యూటీ సీఎం జిష్ణు దెబ్బర్‌మన్, కాంగ్రెస్ నేత సుదీప్ రాయ్ బర్మన్, సీపీఎం నేత జితేంద్ర చౌదరి, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ సహా పలువురు కీలక రాజకీయ నేతల భవితవ్యం తేలనుంది. మరోవైపు త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియను మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు మార్చి 2న నిర్వహించి, ఫలితాలు వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE