కేంద్ర మంత్రివర్గ (కేబినెట్) విస్తరణకు ముహూర్తం ఖరారు అయింది. గత కొన్ని రోజులుగా కేంద్ర కేబినెట్ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 7, బుధవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. రాష్ట్రపతి భవన్ లో నూతన కేంద్రమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. కేంద్ర కేబినెట్ లో మొత్తం 81 మందిని తీసుకునే అవకాశముండగా, ప్రస్తుతం ప్రధానితో కలుపుకుని 53 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. కాగా మార్పులు, చేర్పులుతో కలిపి ఈ రోజు జరగనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం సహాయమంత్రులుగా ఉన్న అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, జీ కిషన్ రెడ్డిలకు పదోన్నతి ఇస్తూ కేబినెట్ మంత్రి పదవులు దక్కనున్నట్టు సమాచారం.
మరోవైపు కేబినెట్ లో అవకాశం దక్కనుందని భావిస్తున్న జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద్ సోనోవాల్, నిసిత్ ప్రమానిక్, ఆర్‌సీపీ సింగ్, పశుపతి పరాస్, భూపేంద్ర యాదవ్, మీనాక్షి లేకి, అనుప్రియా పటేల్, నారాయణ్ రాణె, కపిల్ పాటిల్, హీనా గవిత్, శోభా కరండ్లజే, అజయ్ మిశ్రా, అజయ్ భట్, శాంతను ఠాకూర్ లు ఢిల్లీలోని 7 లోక్ మార్గ్ లో గల ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఇక కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందు, ప్రభుత్వం కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను సృష్టించినట్టు తెలుస్తుంది. ఈ మంత్రిత్వ శాఖ దేశంలో సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక పరిపాలనా, చట్టపరమైన మరియు విధానపరమైన ప్రణాళిక అందిచనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కేబినెట్ విస్తరణ జరగబోతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ