పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బీర్‌భూమ్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దర్యాప్తుపై కలకత్తా హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటనను సుమోటోగా విచారణకు తీసుకున్న కలకత్తా హైకోర్టు బొగ్తుయ్ హత్యల దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తునట్టు వెల్లడించింది. ఈ కేసుపై బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటివరకు సేకరించిన కేసు పత్రాలను, అరెస్టు చేసిన నిందితులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఏప్రిల్ 7లోగా ప్రాథమిక నివేదికను సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఇక కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, సీపీఐ(ఎం) స్వాగతించగా, సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని, కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని టీఎంసీ వెల్లడించింది.
ముందుగా తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బాద్ షేక్ హత్య అనంతరం బీర్‌భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో చెలరేగిన అల్లర్లలో పలు ఇళ్లకు నిప్పటించడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. తమ నాయకుడి హత్య అనంతరం స్థానిక టీఎంసీ కార్యకర్తలే ఇళ్లకు నిప్పంటించారని పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయగా, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు అనిరుల్ హుస్సేన్ ను సహా 22 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు గురువారం నాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బొగ్తుయ్ గ్రామాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఆర్ధిక సాయం అందిస్తామని, సత్వర న్యాయం చేస్తామని బాధితులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ