కాంగ్రెస్‌కు మార్పు కలిసొస్తుందా?

Congress, Rahul gandhi, Lokh sabha elections, Revanth reddy
Congress, Rahul gandhi, Lokh sabha elections, Revanth reddy

ఈ నెలలో వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ మినహా.. మిగతా చోట్ల కాంగ్రెస్‌ ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర చేసినా.. ఎన్నికల్లో సోనియా, ప్రియాంక సహా ప్రముఖులు ప్రచారం నిర్వహించినా ఆ పార్టీ తెలంగాణలో మినహా మిగతా రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోలేకపోయింది. దీంతో మోడీ గాలి ఇంకా వీస్తూనే ఉందన్న ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో ఇండియా కూటమి బలోపేతానికి కాంగ్రెస్‌ విస్తృత కృషి చేస్తోంది. ఎన్నికలు మాత్రమే కాంగ్రెస్‌కు ముఖ్యమని, కూటమి కార్యాచరణతో పనిలేదన్న విమర్శల నేపథ్యంలో దిద్దుబాటుకు ఉపక్రమించింది.

ఈ నేపథ్యంలోనే బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌తో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు. ఇండియా కూటమి బలోపేతంపై చర్చించారు. మరోవైపు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పార్టీపరంగా కూడా సంస్థాగత మార్పులకు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం శ్రీకారం చుట్టింది. సార్వత్రక ఎన్నికలకు వేగంగా సమాయత్తమవుతున్న నేపథ్యంలో భారీ మార్పులను చేపట్టింది. పన్నెండు మంది ప్రధాన కార్యదర్శులతో పాటు పదకొండు రాష్ట్రాలకు ఇన్‌చార్జిలను నియమించింది.  అంతేకాదు.. వివిధ రాష్ట్రాలకు ఇన్‌చార్జులను మార్చింది.

ఇందులో భాగంగా.. ఇప్పుటి దాకా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న మాణిక్‌రావ్‌ ఠాక్రేను మార్చింది. పార్టీ కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీకి అదనంగా తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. ఠాక్రేను గోవా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించింది. ఇప్పటి దాకా గోవా బాధ్యతలు చూస్తున్న మాణిక్కం ఠాగూర్‌కు ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. నిజానికి, తెలంగాణకు అదనపు ఇన్‌చార్జిగా నియమితులైన దీపాదాస్‌ మున్షీ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ ముఖ్య పరిశీలకురాలిగా వచ్చిన ఆమె.. అసంతృప్తులను బుజ్జగించడం, అలిగిన నేతలకు తగిన హామీలు ఇవ్వడం వంటివి చేశారు. ఫలితంగా ఆమెకు ఇక్కడి పరిణామాలన్నింటిపైనా అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సాధారణ మార్పుల్లో భాగంగా ఠాక్రేను గోవాకు పంపిన అధిష్ఠానం.. తెలంగాణకు పూర్తిస్థాయి ఇన్‌చార్జిని నియమించే వరకూ అదనపు బాధ్యతలను దీపాదాస్‌ మున్షీకి అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగానూ కొనసాగుతున్నారు. పార్లమెంటు ఎన్నికలయ్యే వరకూ ఆయననే టీపీసీసీ అధ్యక్షుడిగానూ కొనసాగించనున్నట్లూ చెబుతున్నారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరిగే వరకూ దీపాదాస్‌ మున్షీనే అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఇప్పటి వరకూ ఉత్తరప్రదేశ్‌ ఇన్‌చార్జిగా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. దేశవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉండడంతో ఆమెకు నిర్ధిష్ట రాష్ట్ర బాధ్యత అప్పగించలేదని సమాచారం. ఆమె స్థానంలో యూపీ బాధ్యతను మహారాష్ట్రకు చెందిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్‌ పాండేకు అప్పగించింది. సచిన్‌ పైలట్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఆయనకు ఛత్తీస్‌గఢ్‌ బాధ్యతలు అప్పగించింది.

అలాగే, ముకుల్‌ వాస్నిక్‌కు గుజరాత్‌, జీఏ మిర్‌కు జార్ఖండ్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌ అదనపు బాధ్యత కూడా ఇచ్చింది. హరియాణా నేత కుమారి షెల్జాకు ఉత్తరాఖండ్‌, కేరళ నేత రమేశ్‌ చెన్నితాలకు మహారాష్ట్ర పార్టీ వ్యవహారాలను కేటాయించింది. అసోంతోపాటు మధ్యప్రదేశ్‌ అదనపు ఇన్‌చార్జిగా జితేందర్‌ సింగ్‌, కర్ణాటక ఇన్‌చార్జిగా రణదీప్‌ సూర్జేవాలాను నియమించింది. ఇక, ఢిల్లీతోపాటు హరియాణా అదనపు ఇన్‌చార్జిగా దీపక్‌ బబరియాను నియమిస్తే.. మోహన్‌ ప్రకాశ్‌కు బిహార్‌, చెల్లకుమార్‌కు మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌, అజయ్‌ కుమార్‌కు ఒడిసాతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. భర త్‌ సింగ్‌ సోలంకికి జమ్ము కశ్మీర్‌; రాజీవ్‌ శుక్లాకు హిమాచల్‌ ప్రదేశ్‌, చండీఘర్‌; సుఽఖీందర్‌ సింగ్‌ రంధావాకు రాజస్థాన్‌, దేవేందర్‌ యాదవ్‌కు పంజాబ్‌, గిరీశ్‌ చంద్రశేఖర్‌కు త్రిపుర, సిక్కిం, మణిపూర్‌, నాగాలాండ్‌ బాఽధ్యతలు కేటాయించింది.

చాలాచోట్ల తీవ్రంగా కసరత్తు చేసి ఆయా రాష్ట్రాల్లో కీలకమైన నేతలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. అయితే.. ఇప్పటికీ మోడీ గాలి వీస్తోందని ఈ నెలలో విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఎలాగైనా బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని ఇండియా కూటమి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గేను కూడా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు మార్పులన్నీ ఎంత వరకు కలిసి వస్తాయో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE