టి.కాంగ్రెస్‌లో అసంతృప్తి భగ్గుమంటోంది. టికెట్ దక్కనివారంతా అధిష్టానంపట్ల గుర్రుమంటున్నారు. ముఖ్యంగా రెండో జాబితా వచ్చాక.. అసంతృప్తుల సంఖ్య మరింత పెరిగిపోయింది. 55 మంది అభ్యర్థులతో అధిష్టానం మొదటి జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో పేరు లేకపోవడంతో చాలా మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఇతర పార్టీల్లోకి కూడా జంప్ అయ్యారు. శుక్రవారం మరో 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను అధిష్టానం ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది.
మొదటి జాబితాలో పేరు లేకపోవడంతో.. కనీసం రెండో జాబితాలోనైనా ఉంటుందని చాలా మంది నేతలు ఎదురు చూశారు. కానీ ఈసారి కూడా టికెట్ దక్కక చాలా మంది నేతలు భంగపడ్డారు. టికెట్ దక్కని వారంతా అధిష్టానం పట్ల భగ్గుమంటున్నారు. ముఖ్యంగా మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి అధిష్టానంపై మండిపడుతున్నారు. గత ఏడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లోనే కృష్ణారెడ్డి.. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు.
కానీ అప్పుడు అధిష్టానం కృష్ణారెడ్డికి మొండి చేయి చూపించి.. పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చింది. చివరికి ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో స్రవంతి ఓటమి పాలయింది. అప్పటి నుంచి కృష్ణారెడ్డి మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి జనాలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. కానీ ఈసారి కూడా ఆయనకు నిరాశే ఎదురయింది. అధిష్టానం కృష్ణారెడ్డిని పక్కనబెట్టి.. తిరిగి పార్టీలో చేరిన కోమట్టి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చింది.
పోయిన ఏడాది కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాషాయపు కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. కానీ అక్కడి పరిస్తితుల కారణంగా తిరిగి ఆయన.. సొంత గూటికి చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఈసారి మునుగోడు టికెట్‌ను రాజగోపాల్‌రెడ్డికే కట్టబెట్టింది. కృష్ణారెడ్డికి మొండి చేయి చూపించింది. దీంతో ఆయనతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు కృష్ణారెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తన అనుచరులతో సమావేశం అయ్యాక… తుది నిర్ణయం తీసుకోనున్నారట. ఈ పరిణామాల మధ్య మునుగోడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కృష్ణారెడ్డి.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ