ఈ రోజు హైదరాబాద్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలుత రాజ్ భవన్ కి వెళ్లి తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా రెండురాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర విభజన సమస్యలపై త్వరలో రెండు రాష్ట్రాల అధికారులు సమావేశం అవుతున్న నేపథ్యంలో ఆదిశగా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. గవర్నర్ తో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్, ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, ఇతర అంశాలపై, గతంలో చర్చించిన దానిపై వచ్చిన పురోగతిపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
గతంలో జూన్ 28వ తేదీన ప్రగతిభవన్ లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యి, గోదావరి జలాలను శ్రీశైలం, మరియు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లకు తరలింపుపై చర్చించారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు, ఆ తరువాత పురోగతిపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా అంశాలన్నీ ఈ భేటీలో మరోసారి చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, అంతే కాకుండా ఆగస్ట్ 8న కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో రెండురాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై ఢిల్లీలో అతి కీలకమైన సమావేశం ఉన్న నేపథ్యంలో అందులో అనుసరించాల్సిన విధానాలపై, తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చిస్తారని తెలుస్తోంది. భేటీ అనంతరం లోటస్ పాండ్ చేరుకొని,ఈ రోజు రాత్రికి వై.ఎస్ జగన్ తన కుటుంబంతో కలిసి నాలుగు రోజుల పాటు జెరూసలేం పర్యటనకు వెళ్లనున్నారు.
[subscribe]
[youtube_video videoid=1Wc5WjUOcPA]