అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష

Ashwathama Reddy Started Hunger Strike, Ashwathama Reddy Started Hunger Strike At His House, Ashwathama Reddy Started Indefinite Hunger Strike, Ashwathama Reddy Started Indefinite Hunger Strike At His House, Mango News Telugu, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TSRTC Strike Updates

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గత 43 రోజులుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నవంబర్ 16, శనివారంనాడు తలపెట్టిన బస్‌రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఉదయం నుంచే డిపోల ఎదుట నిరసనకు దిగిన కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. జిల్లాల్లో కార్మిక సంఘాల నాయకులను, కార్మికులను అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, కో-కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేసారు. కార్మికులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటుండడంతో వారి ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఊర్మిలానగర్‌లోని నివాసంలోనే దీక్షకు దిగుతున్నట్టు జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.

పోలీసులు అరెస్టు చేసినా కూడ, ఎట్టిపరిస్థితుల్లోనైనా పోలీస్‌స్టేషన్‌లోనూ దీక్ష కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిచేంతవరకు తన దీక్ష కొనసాగుతుందని తెలిపారు. ముందు రోజు రాత్రినుంచే తన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు భయాందోళనకు గురిచేసారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. కార్మిక సంఘాల జేఏసీ పిలుపిచ్చిన బస్‌ రోకోకు ఎలాంటి అనుమతి లేదని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ముందుగానే స్పష్టం చేశారు. ప్రతి బస్‌ డిపో మరియు బస్‌ భవన్ల వద్ద 500 మీటర్ల వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు. కార్మికులు ఆందోళన చేసి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంజనీకుమార్‌ హెచ్చరించారు.

[subscribe]