లోక్ స‌భ ఎన్నిక‌ల వేళ‌.. ఎవ‌రు ఎటువైపు..

Lok sabha elections, Telangana, congress, brs, Lok sabha , Revanth Reddy News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Mango News Telugu,Mango News
Lok sabha elections, Telangana, congress, brs

ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్‌.. అని సుమతి శతకంలో  చెప్పింది చాలామందికి గుర్తుండే ఉంటుంది. అలాగే అధికారం ఉన్నప్పుడే ఎవరైనా పార్టీలోకి చేరతారు. అది ఎప్ప‌టి నుంచో ఉన్న సంస్కృతే. మొన్నటి వరకూ వివిధ పార్టీల నుంచి పలువురు బీఆర్‌ఎస్‌లో చేరగా, ప్రస్తుతం సీన్‌ కాంగ్రెస్‌ వైపు మళ్లింది. అందుకు కారణం ప్ర‌స్తుతం ఆ పార్టీ అధికారంలో ఉండ‌డ‌మే. ఈ ప‌రిణామాలు ప్ర‌తిప‌క్ష పార్టీని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అయినా స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్న ఆ పార్టీలో ఇప్పుడెలా అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

జిల్లా పరిషత్‌ చైర్మన్లు, మాజీ మేయర్లు, డిప్యూటీమేయర్లు, ఇతరత్రా పదవులున్న వారు, పార్టీలో కార్యవర్గాల్లో స్థానాలున్న వారు, లేనివారు ఎందరెందరో ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇటీవ‌లే వికారాబాద్‌ జడ్‌పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీత మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతురామ్మోహన్‌ దంపతులు, సినీ హీరో అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి  గాంధీభవన్‌లో  కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో  కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. వీరంతా నిన్నటి వరకు బీఆర్‌ఎస్‌ లీడర్లే. వీరితో పాటు మరికొందరు కూడా కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది.

కాకపోతే మంచి ముహూర్తాల కోసం.. ఇతర పనుల వల్ల..జడ్‌పీ చైర్మన్‌ పోస్టు అవిశ్వాసంలో పడకుండా ఉండటం తదితర కారణాలతో వేచి చూస్తున్నారు. అలాంటి వారిలో రంగారెడ్డి జడ్‌పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఆమె మామ,మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తదితరులెందరో ఉన్నారు. ఇంకా తెరపైకి రాని వారు చాలామందే ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లో చేరనున్నారు. రాజకీయాల్లోని వారికి పదవుల వ్యామోహం ఉంటుంది. అవి లేనిదే ఉండలేని వారుంటారు. పదవులు లేకపోయినా కనీసం అధికార పార్టీలో ఉంటే తమ పనులు చేసుకోవడానికైనా, నీతిమంతంగానో, అవినీతిమంతంగానో తాము చేసుకునే వ్యాపారాలకు  ఆటంకాలు ఉండరాదనుకునే వారు సైతం అధికార పార్టీ పంచన చేరడం తెలిసిందే.

లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను కనీసం పదైనా గెలవాల్సిందే. ఇదీ కాంగ్రెస్‌ లక్ష్యం. లేకుంటే ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువరోజులుండదు.. పడిపోతుందని పదేపదే పాటపాడుతున్న బీఆర్‌ఎస్‌ నేతలకు అవకాశమిచ్చినట్లవుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే సీఎం, పీసీసీ ప్రెసిడెండ్‌ రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చేవారిని చేర్చుకోవడమే కాక.. తమవైపు నుంచి కూడా పలువురు నేతలను ఆకట్టుకునే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ నుంచే కాదు బీజేపీ నుంచి సైతం వీలైనంతమందిని పార్టీలో చేర్చుకోవాలనే తలంపుతో ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరుతున్న వారు ముఖ్యంగా లోక్‌సభ టిక్కెట్లపై కన్నేశారు. వాటిని దక్కించుకోవాలనే ఆశతో చేరుతున్నారు. టిక్కెట్‌ హామీలున్నాయో లేదో తెలియదు కానీ.. టిక్కెట్‌ ఇస్తామంటేనే వస్తున్నామని చెప్పే పరిస్థితి వారికి కూడా లేదు. అయినా ఆశ మాత్రం అదే. చేరేవారిలో ఎందరి ఆశలు తీరతాయో, తీరవో కానీ కాంగ్రెస్‌వైపు క్యూ మాత్రం కడుతున్నారు.

ఇది ఒక‌వైపు కాంగ్రెస్ లో ఉత్సాహం నింపుతున్నా, మ‌రోవైపు క‌ల‌వ‌ర‌మూ మొద‌లైంది. వీరితో పార్టీ బ‌లం పెరిగే అవ‌కాశం ఉన్నా.. అంత‌ర్గ‌త క‌ల‌హాల‌కు అవ‌కాశాలు ఉంటాయ‌న్న చ‌ర్చ మొద‌ల‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న‌వారికి కాద‌ని, కొత్త‌గా వ‌చ్చేవారికి ప్రాధాన్యం ఇస్తే కొంద‌రు పార్టీ వీడే చాన్స్ లేక‌పోలేదు. ఈ క్ర‌మంలో పార్టీ అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో సీట్ల కేటాయింపుపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఎవ‌రు ఎటువైపు స్ప‌ష్ట‌త రానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ