తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లోనూ ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించాలని రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్రను, రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ప్రసంగాలుండాలని, ఈ ప్రసంగాలను జిల్లా కలెక్టర్లు నిర్దిష్టమైన సమాచారంతో తయారుచేయాలని సూచించారు. వేసవి రోజులు కావడంతో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉదయం 9 గం.లకే ప్రారంభించి త్వరగా ముగించాలని సూచించారు.
సాయంత్రం పూట జిల్లా కేంద్రాల్లో మరియు హైదరాబాద్ రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహించాలని, తెలంగాణ గొప్పతనాన్ని తెలియజేసేలా కవితలను రాయాల్సిందిగా కవులను, రచయితలను ఆహ్వానించాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో తెలంగాణ సాంస్కృతిక శాఖ కళాకారులతో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, రవీంద్రభారతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. కాగా ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. 8 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోటీ పడే స్థాయిలో నిలవడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ