తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ రోజు (ఫిబ్రవరి 15, శనివారం) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పోలింగ్ జరగనున్నట్టు అధికారులు తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఒక గంట పాటు విరామమిచ్చి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఫలితాలు వెల్లడించి గెలిచినా అభ్యర్థులకు సహకార శాఖ అధికారులు ‘గెలుపు ధ్రువీకరణ పత్రం’ అందజేస్తారు.
రాష్ట్రంలో మొత్తం 909 సహకార సంఘాలు ఉండగా, నాలుగు పాలకవర్గాలకు ఇంకా పదవీకాలం పూర్తికాకపోవడంతో 905 చోట్లనే ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో కూడా 157 సంఘాల్లో ఏకగ్రీవంగా ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. శనివారం జరుగుతున్నా ఎన్నికల్లో గెలిచే వార్డు సభ్యులంతా ముందుగా అన్ని చోట్ల పీఏసీఎస్ చైర్మన్లును ఎన్నుకుంటారు. ఆతర్వాత పీఏసీఎస్ చైర్మన్ల నుంచి జిల్లాలవారీగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య(డీసీఎంఎస్) లకు పాలక వర్గాలను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికకు సంబంధించి ప్రత్యేక ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.
[subscribe]