రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై ఈ రోజు హైకోర్టు స్టే విధించింది. తన భారత పౌరసత్వాన్ని రద్దు చేయడంపై చెన్నమనేని రమేశ్ మరోమారు హైకోర్టును ఆశ్రయించగా, ఈ పిటిషన్ పై నవంబర్ 22, శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని రమేశ్ తరపు న్యాయవాది వాదనలు మరియు ప్రతివాది అయిన ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు 4 వారాల పాటు రద్దు ఉత్తర్వులపై స్టే విధిస్తూ, తదుపరి విచారణను డిసెంబర్ 16 కు వాయిదా వేసింది.
భారత పౌరసత్వాన్ని పొందేందుకు చెన్నమనేని రమేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని, వాస్తవాలను దాచిపెట్టి మోసపూరిత విధానాల ద్వారా పౌరసత్వం పొందినందువలన నవంబర్ 20, బుధవారం నాడు ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ 2009 నుంచి పోరాటం చేస్తున్నారు. చెన్నమనేని రమేశ్ 1993లో జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించారు, అనంతరం 2008 జనవరిలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే 2009లో పౌరసత్వం వచ్చినట్టుగా కోర్టుకు తెలిపారు. మరో వైపు 2009లో టీడీపీ నుంచి వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేశ్, ఆ తర్వాత టీఆర్‌ఎస్ లో చేరారు. 2010లో జరిగిన ఉప ఎన్నికతో పాటు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుసగా విజయం సాధించారు. పౌరసత్వ రద్దుపై ఈ రోజు హైకోర్టు స్టే విధించడంతో ఆయన ఎమ్మెల్యే పదవిలో కొనసాగే అంశంపై ఉత్కంఠ విడిపోయి, ఊరట లభించినట్టయింది.
[subscribe]






































