
తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడటంతో.. ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కిపోతోంది. అయితే ఓ వైపు ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటూ ఉంటూ.. మరోవైపు ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు పార్టీ పిలుపునివ్వడం కలకలం రేపుతోంది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ప్రశాంత వాతావారణంలో ఎన్నికలను జరిపించడానికి పోలీసు శాఖ కట్టుదిట్టమైన అన్ని చర్యలు చేపట్టింది.
మారుమూల గ్రామాలతో పాటు అటవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్లను మోహరించి.. పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. మావోయిస్టు పార్టీ కదలికలను గమనిస్తూ కట్టడి చేయడానికి ప్రత్యేక చర్యలు చేప్టటారు. ఎక్కడిక్కడే చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి, తనిఖీలను ముమ్మరం చేశారు. తెలంగాణలోని మావోయిస్టుల ప్రభావం కలిగిన అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు అదనపు పోలీసు బందోబస్తును కూడా రెట్టింపు చేశారు.
మరోవైపు మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో డిసెంబరు 2 నుంచి పీఎల్‌జీఏ అంటే..పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు జరుగనున్నాయి. ఈ వారోత్సవాలకు సంబంధించిన ప్రకటననే తాజాగా మావోయిస్టు పార్టీ రిలీజ్ చేసింది. పీఎల్‌జీఏ వారోత్సవాలు జరుపుకోవడం ద్వారా.. తమ ఉనికిని చాటుకోవడానికి మావోయిస్ట పార్టీ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ముగ్గురు బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఈ మద్య హెచ్చరించింది. వారి వైఖరి మార్చుకోవాలని, లేకపోతే ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదనే హెచ్చరికలను జారీ చేసింది.
కొయ్యూరు అటవీ ప్రాంతంలో 1999లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో కొంతమంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఎన్ కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యులు నల్ల ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రంశెట్టి సంతోష్‌రెడ్డి చనిపోయారు. అయితే 2000 సంవత్సరం నుంచి..ఆ ముగ్గురు అగ్రనేతలకు నివాళులు అర్పిస్తూ పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహిస్తోంది మావోయిస్టు పార్టీ. అలా ఈసారి వారోత్సవాల కోసం రిలీజ్ చేసిన ప్రకటనలో..తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలంటూ పిలుపునివ్వడంతో . పోలీస్‌శాఖ అప్రమత్తమైంది.
ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఆరు చెక్ పోస్టులను పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. వీటిలో ఒక అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఉండగా, మరో ఐదు అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఉన్నాయి. కోటపల్లి మండలం రాపన్‌పల్లి వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్టు.. జైపూర్ మండలం ఇందారం, జన్నారం మండలం కలమడుగు, తాండూరు మండల కేంద్రం, దండేపల్లి మండలం గూడెం, ఇందన్‌పల్లి వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
ఇప్పటి వరకు సీఆర్‌పీఎఫ్ 11 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు కరీంనగర్‌కు చేరుకోగా, స్థానిక పోలీసులతో కలిసి పనిచేయడానికి ప్రత్యేక కమాండెంట్ కంట్రోల్‌లో విధులు నిర్వహించే కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో స్టాటికల్ సర్వేయ్‌లెన్స్ టీమ్స్ , ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్‌తో నిఘాను ముమ్మరం చేశాయి. ఒక్కో నియోజక వర్గానికి మూడు టీములతో పాటు.. మొత్తం తొమ్మిది ఎస్‌ఎస్‌టీలను ఏర్పాటు చేశారు.
మొత్తంగా మావోయిస్టు లేఖల వల్ల కిందిస్థాయి అధికారులు, సిబ్బంది పూర్తిగా అప్రమత్తం అయి.. మావోయిస్టుల చర్యలను అడ్డుకుంటూనే ఎన్నికలు ప్రశాంతంగా జరిపించడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మావోయిస్టు ప్రభావం గల కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను సేవలను వినియోగించుకుంటూ అదనపు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థులకు పూర్తి ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి బార్డర్ వద్ద ప్రత్యేకంగా డ్రోన్ సర్వేలెన్స్‌తో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE