తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆగస్టు 29, శనివారం నాడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో 530 మంది లబ్ధిదారులకు రూ.6.14 కోట్ల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది. కరోనా సమయంలో ఎక్కడా సంక్షేమం ఆగకుండా తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు జిల్లాలో రూ.34.16 కోట్ల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశామని చెప్పారు.
కరోనాకు భయపడాల్సిన పని లేదు, అధైర్యపడొద్దు. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచన చేశారు. మాస్కులు లేకుండా ఎవ్వరూ బయటకు రావొద్దు. సంగారెడ్డి జిల్లాలో ఒక్క రోజే 2 వేల టెస్ట్ లు చేశాము. అవసరమైతే ప్రత్యేకంగా మొబైల్ వ్యాన్ ను గ్రామాలకు పంపి, పరీక్షలు చేస్తున్నాం. కొద్దిగా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా ప్రభుత్వం తరపున అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu