తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా త్వరలో తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగాల కొరకు నిర్వహించనున్న పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు పోటీపరీక్షల పుస్తకాలను ఉచితంగా అందజేశారు. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎక్స్పో ప్లాజాలో శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ క్రమంలో స్థానిక ఉద్యోగార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలలో సుమారు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ చేపట్టారని, దీనిని నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని యువత రానున్న కొన్ని నెలలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, కెరీర్ పైన దృష్టి పెట్టాలని సూచించారు. త్వరలో జరుగనున్న పోటీ పరీక్షలను సీరియస్‌గా తీసుకోవాలని, ప్రిపరేషన్ బాగా ఉండాలని సలహానిచ్చారు. పట్టుదలతో ప్రయత్నించి ఉద్యోగాలు సాధించాలని, తద్వారా మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చొరవతో మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కొరకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. మంత్రి విజ్ఞప్తి మేరకు ప్రత్యేక నిధులు మున్సిపల్ శాఖ ద్వారా మంజూరు చేస్తున్నామని, ఇంకా ఏవైనా అభివృద్ధి పనులు తమ దృష్టికి తెస్తే సాధ్యమైనంత మేరకు తమ వంతు సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ