రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలో మేధా గ్రూప్ ఏర్పాటు చేస్తున్న భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ భూమిపూజ చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ రైల్వేకోచ్ ఫ్యాక్టరీని సంవత్సరానికి 500 కోచ్ లు ఉత్పత్తి చేసేలా, 1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా మరో 1200 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఈ సంస్థ లోకోమోటివ్‌లు, రైళ్లు, కోచ్‌లు, మెట్రో రైల్స్, మోనో రైల్స్ సహా ప్రపంచ స్థాయి హైటెక్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారు చేస్తుంది.
ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలు మేధా గ్రూప్ ఇలాంటి ప్రపంచ స్థాయి రైలు కోచ్ ఫ్యాక్టరీని స్థాపించడానికి ఎంతగానో దోహదపడ్డాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామని తెలిపారు. ఇది భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ రైల్ కోచ్ ఫ్యాక్టరీగా అవతరిస్తుందని, తెలంగాణలో రైలు కోచ్ తయారీలో ఒక కొత్త ఒరవడిని, నూతన వ్యవస్థను సృష్టిస్తుందని భావిస్తున్నానని మంత్రి కేటిఆర్ అన్నారు. ఆరు సంవత్సరాల క్రితం తెలంగాణ ఏర్పడినప్పుడు కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరి ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానం నెరవేరకపోవడం చాలా విచారకరమని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టి కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మంత్రి కేటిఆర్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu