వ్యవసాయ, ఉద్యాన పంటలు, వాటి ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పరిశీలన కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధుల బృందం మహారాష్ట్ర రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు అహ్మద్ నగర్ జిల్లా షిరిడీ సమీపంలో ద్రాక్ష, జామ తోటలు పరిశీలించి స్థానిక వ్యవసాయ, ఉద్యాన అధికారులు, రైతులతో సమావేశమయ్యారు. అలాగే షిరిడీ ప్రాంతంలో వర్షపాతం వివరాలు, పంటల రకాలు, సాగునీటి వసతి, పంటల మార్కెటింగ్ పై రైతులతో సంభాషించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, దేశాన్ని పంటకాలనీలుగా విభజించాలని అన్నారు. దేశంలో రైతు కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే దేశంలో ఏ పంట ఎంత అవసరం అన్న ప్రణాళిక ఉండాలని, కానీ కేంద్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. దేశాన్ని పంట కాలనీలుగా విభజించి పంటల సాగుకు మార్గదర్శనం చేయాలని, రైతుకు న్యాయం జరిగేలా ఉండాలన్నారు. రైతుకు ఎంత చేసినా తక్కువేనని చెప్పారు.
పంటల మార్పిడితో రైతులు లాభాలు గడించాలన్నదే మా ఉద్దేశం:
“పంటల మార్కెటింగ్, ఎగుమతుల విషయంలో రైతుకు సాయం చేయాల్సిన కేంద్రం చేటు చేస్తున్నది. భవిష్యత్ తరాలు వ్యవసాయం వైపు మళ్ళాలి. యువత వ్యవసాయంలో తమదైన ముద్ర వేయాలి. తెలంగాణలో పంటల వైవిద్యీకరణ కోసం పెద్ద ఎత్తున కృషిచేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరెంటు ఇస్తూ వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం సమూలంగా మారిపోయింది. పంటల మార్పిడితో రైతులు లాభాలు గడించాలన్నది మా ఉద్దేశం. మహారాష్ట్ర జాల్నా ప్రాంతంలో వ్యవసాయ ఉద్యాన పంటల పరిశీలనకు వచ్చాం. తెలంగాణలో పంట మార్పిడి కోసం ఇప్పటికే కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పర్యటించడం జరిగింది” అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి నిరంజన్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకట రమణా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ఉద్యానశాఖ జేడి సరోజినిదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ సుభాషిణి తదితరులు పాల్గొంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ